యూట్యూబ్ ఛానెల్స్ నయాదందా

సెటిల్ మెంట్లు, జడ్జిమెంట్లు

Share this :

వాళ్ళు న్యాయశాస్త్రం చదవలేదు. కానీ.. శాస్త్రాన్ని పుక్కిట పట్టినట్టే మాట్లాడేస్తారు. అది న్యాయస్ధానం కాదు.. కానీ ఎలాంటి శిక్షలు పడాలో ఇట్టే తీర్పులు చెప్పేస్తారు. వారు పోలీసులు కాదు.. కానీ దండన తప్పదంటూ దబాయించేస్తారు. ఇది ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కనిపించే దృశ్యాలు. ఆ ప్రోగ్రామ్ కు ఓ పేరు పేట్టేసి, ఓ ట్యాగ్ లైన్ తగిలించేసి మరీ .. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ డిజిటల్ ఛానెళ్ళు ఇప్పుడు ఎన్నో. తామరతంపరగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళు, అవి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. చివరికి సంబంధిత శాఖలు కూడా కన్నెర్ర చేసే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఎందుకు ఇలా.. నియంత్రణ లోపించా.. లేక కట్టడి చేసే వ్యవస్ధ లేకా..? అసలు ఆయా కార్యక్రమాలలో పాల్గొంటున్న వారంతా నిజంగా బాధితులేనా .. ? అయితే ఛానెళ్ళనే ఎందుకు ఆశ్రయించాలి. న్యాయం కావాలంటే కోర్టులను .. లేదా పోలీస్ స్టేషన్లను కదా ఆశ్రయించాల్సింది. చానెళ్ళ గడపెందుకు తొక్కుతున్నారు. ఇందులో మతలబేంటి.. .. ? రేటింగుల కోసం పాకులాటా.. సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ఆరాటమా.. .. ? రెవెన్యూ కోసం పడుతున్న తంటాలా ..?

దేశంలో ఎక్కడైనా ఓ దిన పత్రిక కానీ, వార పత్రిక కానీ, మాస పత్రిక కానీ వార్షిక పత్రికలు కానీ నడపాలంటే  (RNI)లో తప్పకుండా రిజిస్టేషన్ చేయించుకోవాల్సిందే. పీఆర్బీ చట్టానికి అనుగుణంగా ఆయా పత్రికలను నడపాల్సిందే. అలాగే .. శాటిలైట్ ఛానెళ్ళు కూడా అనుమతులు పొందాకే .. చట్ట పరిధిలో తమ తమ చానళ్ళను నడుపుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. కుప్పుల తెప్పలుగా యూట్యూబ్ ఛానెల్స్ (డిజిటల్) పుట్టుకొస్తున్నాయి. ఎవరికి తోచింది వారు .. ఇష్టానుసారం కంటెంట్లను ఇస్తున్నారు. వాటికి అడ్డూ అదుపూ లేదు. ఎవరినైనా సునాయసంగా తిట్టేయచ్చు. ఎవరినైనా డిజిటల్ వేదికపై కడిగేయొచ్చు. దోషులుగా నిలబెట్టేయొచ్చు. తమకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో శిక్షలు విధించేయొచ్చు. అడిగే వాడెవ్వడు.. అడ్డుకునేదెవ్వరు…… ? ఇది ఇప్పుడు కనిపిస్తున్న, వితండ, వింత ధోరణి. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఎందుకు ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చట్టాలను బలంగా తీసుకు రాలేకపోతున్నాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ దేశాన్ని విజ్ఞాన భరిత సమాజంగా మార్చేందుకు డిజిటల్ వినియోగం, డిజిటల్ సాధికారిత వల్ల సాధ్యపడుతుందని భావించింది. కానీ.. జరుగుతున్నదేంటి.. .. ? వారి వారి ఛానెల్ కు తగినంత పాపులారిటీ పెంచుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే .. జట్కాబండ్లు లాంటి కార్యక్రమాలు. చానెళ్ళు వేటికవే న్యాయం చేసే స్ధానాలుగా భావించుకోవడం.. కృష్ణానగర్ అడ్డా నుంచి జూనియర్ ఆర్టిస్టులను తీసుకు వచ్చి గంటలు కొద్దీ కార్యక్రమాలు రూపొందించడం. నిజంగా వారంతా ఆ ఛానెల్ ను ఎందుకు ఆశ్రయిస్తున్నారా అన్న అనుమానాలు మొలకెత్తడం. ఇవన్నీ షరా మామూలే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే .. నిజంగా ఎవరైనా .. వారికి జరిగిన అన్యాయాన్ని ఆయా ఛానెళ్ళ దృష్టికి తెచ్చి .. పరిష్కరించమంటే వారు ఏం చేస్తారు .. ? ఆ కుటుంబాన్ని తమ లేకీ ప్రశ్నలతో వేధించి .. బజారున పడేయడమేనా. వాస్తవంగా ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించాల్సింది ఎవరు .. ? పోలీసులు లేక న్యాయస్ధానాలు. ఆ రెండు శాఖలు విచారించి పరిష్కరించిన అద్భుతమైన కేసులను కార్యక్రమాలుగా ప్రసారం చేయకుండా .. వీళ్ళే న్యాయ నిర్ణేతలుగా మారి .. జనాలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారన్న విమర్శలు ఎన్నో ఉన్నాయి.

ఇక కొన్ని సందర్భాలలో అయితే ఆయా కార్యక్రమాల నిర్వాహకులే ..నోరు పారేసుకుంటూ .. తంతా.. చమడాలు వొలుస్తా.. తాట తీస్తా అంటూ ప్రేలాపనలు చేయడం జుప్స కలిగించే అంశాలు. చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడమేంటి. అసలు ఇలాంటి వాటిని నియంత్రించే వ్యవస్ధలు లేకపోతే .. సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు నిజంగా పిచ్చెక్కిస్తాయి. ఉన్న కొద్ది పాటి జ్ఞానాన్ని హరించి వేస్తాయి. పత్రికలలో ప్రచురితమయ్యే కొన్నికొన్ని వార్తలను సుమోటోగా స్వీకరిస్తున్న న్యాయస్ధానాలు .. జట్కాబండి లాంటి కార్యక్రమాలపై కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలకు సూచనలు చేసి .. అలాంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించే అవసరం కూడా ఉంది. నియంత్రణ తప్పితే .. వ్యవస్ధకే చేటు. పర్యవేక్షణ లోపిస్తే.. సమాజానికే చేటు.

బాధితులు వస్తే… మంచి బేరం దొరికినట్లే..

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ యూట్యూబ్ ఛానెల్ దే. అన్నీ అక్రమ సంబంధ చర్చలే. నిజమైన బాధితులు యూట్యూబ్ ఛానెల్స్ ఆశ్రయిస్తే… అవతలి వారి ఫోన్ నంబర్ తీసుకొని వారికి ఫోన్ చేసి.. ‘ఫలానా టీవీ ‘ నుంచి మాట్లాడుతున్నాం . మీ కేసు మా దగ్గరికి వచ్చింది. లైవ్ షో చేయబోతున్నాం అని ఫోన్ చేస్తారు. అవతల వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేస్తారు. తర్వాత ప్యాకేజీ మాట్లాడతారు. పేమెంట్ ఇతరుల అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు. పేమెంట్ జమ అవుతూనే .. సదరు బాధితురాలిని పిలిచి… మీ సమస్య మేం డిస్కస్ చెయ్యకూడదు. లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని పంపేస్తారు. కొన్ని లైవ్ షోలలో బాధితులను వీరే సృష్టిస్తారు.

 పోలీసుల నిఘా అవసరం

కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో వచ్చే చర్చలు, పంచాయితీల నిఘా ఉంచి కార్యక్రమం అయిన తర్వాత వారి వివరాలు సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్ లో వివరాలు తెలియపరచాలని సదరు యూట్యూబ్ ఛానెల్స్ కు ఆదేశాలివ్వాలి.