తెలంగాణ జాతి పిత అని గొప్పగా పిలిపించుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యేక తెలంగాణ రావడానికి ఆయనే కారణం అని గొప్పగా చెబుతారు. అసలు ఆయన పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదంటారు. ఆయన ఎవరో కాదు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అంతా కేసీఆర్ అని పిలుస్తారు. ముందు ఉద్యమ పార్టీగా మొదలు పెట్టారు.. తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చారు.. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ అని ప్రకటించారు. హ్యాట్రిక్ సీఎం అవుదామనుకున్న కలలు చెదిరిపోయాయి. ఆ తర్వాత నుంచి ఆయన కూడా కనుమరుగయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యం అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమం ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ రాజకీయ ప్రస్తానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. 1999లో రెండోసారి గెలిచిన కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. కేసీఆర్‌ను చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్‌ను చేశారు. అది ఆయనకు నచ్చలేదు. మంత్రి పదవి కావాలన్నారు. కానీ సామాజిక సమీకరణలు బేరీజు వేసుకున్న చంద్రబాబు.. మంత్రి పదవి సాధ్యం కాదన్నారు. అంతే.. తెలంగాణకు అన్యాయం అంటూ గగ్గోలు పెట్టారు. నిజానికి అప్పటికే తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ.. వారికి వచ్చిన పదవి.. కేసీఆర్‌కు రాకపోవడంతో.. తెలంగాణ మొత్తానికి అన్యాయం జరిగినట్లు తెగ గోల పెట్టారు. అంతే.. భజన బ్యాచ్ కూడా మొదలైంది.
ఇక ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం అంటూ ప్రజలను నమ్మించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్.. యూపీఏ-1 సర్కార్‌లో కార్మిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పుడు తెలంగాణ గురించి మర్చిపోయారు. కానీ.. కొద్ది రోజులకే చేసిన అవినీతి బయట పడటంతో మళ్లీ కాంగ్రెస్‌తో లొల్లి పెట్టుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. మళ్లీ సైకిల్ పార్టీపై యుద్ధం ప్రకటించారు. ఇక ఆ తర్వాత నుంచి నిరాహార దీక్ష అంటూ మరో పోరాటం మొదలుపెట్టారు. మళ్లీ నీరు, నిధులు అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. సకల జనుల సమ్మె అన్నారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అని.. లేదంటే కేసీఆర్ తల తీసుకుంటాడంటూ శపధాలు, హామీలు ఇచ్చారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతే.. దళిత సీఎం ఏమయ్యాడో తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ వాదం కూడా పోయింది. అంతా అన్నదమ్ములే అన్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రెండో సారి సీఎం అయ్యారు. 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ సీఎం అవుదామనుకున్న ఆయన కల నెరవేరలేదు. ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. అంతే.. నాటి నుంచి ఇప్పటి వరకు.. రెండున్నరేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు తెలంగాణ భవన్‌కు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు తప్ప.. అన్న చెల్లెలు మధ్య గొడవ కూడా తీర్చలేక పోయారు.
ఇక తెలంగాణ వాదానికి తానే పేటెంట్ అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ జాతి పిత, తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవటమే తప్ప.. కనీసం తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కాదు కదా.. ఫామ్ హౌజ్‌లో కూడా ఆయన తెలంగాణ జెండా ఆవిష్కరించినట్లు, తెలంగాణ జెండాకు అభివాదం చేస్తున్న ఫోటో కూడా బయటకు రాలేదు. అంటే తెలంగాణ పేరుతో రాజకీయం చేయడం.. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప.. తెలంగాణ అంటే ప్రేమ, గౌరవం లేవా అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ 17న అంతా ఘనంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది.. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనం అయిన రోజు సెప్టెంబర్ 17. రజాకార్ల ఆగడాలు అంతమై ప్రజాస్వామ్యానికి నాంది పలికిన రోజు. అలాంటి రోజున కూడా కేసీఆర్ అమరవీరులకు గౌరవ వందనం చేయలేదు. మరి ఈయన జాతి పిత, బాపు ఎలా అయ్యారో.. తెలంగాణ వాదులే చెప్పాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.
