తాజా వార్తలు

కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందా.. లేదా..?

టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీకి ఎలాంటి పొత్తు లేనట్లుగా..

Share this :

కాషాయ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు అనే మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఇప్పటికే పుష్కర కాలం పూర్తి చేసుకుంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో బీజేపీ 240 ఎంపీ సీట్లు గెలుచుకుంది. మొత్తం 543 స్థానాలకు 273 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ర్వాత స్థానంలో 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ఎన్‌డీఏ సర్కార్ అధికారంలో ఉండటంలో టీడీపీ కీలకం. అలాగే ఏపీలో బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేయగా.. నాలుగు చోట్ల గెలిచింది. ఆ నాలుగు కూడా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతోనే గెలిచినట్లు కాషాయ పార్టీ పెద్దలే స్వయంగా ఒప్పుకున్నారు.

అయితే ప్రస్తుతం కాషాయ పార్టీ నేతల తీరు చూస్తే మాత్రం.. ఎన్‌డీఏలో టీడీపీ, జనసేన భాగస్వాములనే విషయాన్ని మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. అసలు టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీకి ఎలాంటి పొత్తు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇందుకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా నాగేశ్వర్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఆయనకు ఆయన ఓ కట్టుకథ అల్లుకుని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన నోటికి వచ్చినట్లు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఏపీలో జనసేన నేతలు కేసులు పెట్టడంతో.. దెబ్బకు భయపడిన నాగేశ్వర్.. సైలెంట్‌గా సారీ చెప్పారు. అయితే.. ఇక్కడే అసలు కథ మొదలైంది.

నాగేశ్వర్ వ్యాఖ్యలపై ఏపీలో జనసేన నేతలు ఘాటుగా బదులిచ్చారు. దీంతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. తెలంగాణ, ఆంధ్ర అంటూ వింత వాదన చేస్తున్నారు. నిజానికి నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీలో కింగ్ మేకర్ అమిత్ షా పేరును ప్రస్తావించారు. ఈ వివాదానికి పవన్‌తో అమిత్ షా చేసిన కామెంట్లు అన్నట్లుగా నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీంతో జనసేన, టీడీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు.. ఈ వివాదానికి ఆంధ్ర, తెలంగాణ అంటూ ప్రాంతీయ వాదాన్ని రుద్దే ప్రయత్నం చేశారు. ఆంధ్ర పెత్తనం, ఇనుక బూట్లూ అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇక మరికొంత మంది అయితే.. మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లో కాలు ఎలా పెడతారో చూస్తామంటూ బెదిరించే స్థాయికి దిగజారారు.

అయితే దీనిపై ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ నేతలు కనీసం స్పందించలేదు. తెలంగాణలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పవన కల్యాణ్ ప్రచారం చేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇళ్లకు వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. అయినా సరే.. తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం.. ఏపీలోని పార్టీల అధినేతల పట్ల కనీస సాన్నిహిత్యం లేకుండా పోయింది. ఓ వైపు హైదరాబాద్ నడిబొడ్డున ప్రెస్ మీట్ పేరుతో కొందరు రచ్చ చేస్తున్నా సరే.. మీరెవరు అని కనీసం వారిని ఖండించటం లేదు కాషాయా నేతలు. పైగా మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా అలా అనరు.. అనలేదు అని బీజేపీ నేతల్లో కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చి ఖండించలేదు. అసలు కూటమిలో ఉన్నారా.. లేరా అనే అనుమానం వచ్చేలా టీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

leave a reply