Telangana New Government హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ (Telangana) రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Anumula Revanth Reddy) గురువారం (డిసెంబర్ 8) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ ప్రమాణ స్వీకారం ద్వారా తెలంగాణ ప్రజలు.. ‘రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షను నెరవేర్చడానికి మా ప్రభుత్వం (Congress) ప్రతినబూనింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ వేదికపై నుంచి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రజాభవన్‌లోకి ప్రవేశించి మీ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు.
తెలంగాణను మిగతా రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతోనే పోటీపడేలా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతాను. సోనియమ్మ అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాను. మీకు సేవ చేయడానికే మీరిచ్చిన ఈ బాధ్యతను శ్రద్ధగా నిర్వహిస్తా. ఈ అవకాశాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు అవిరామ కృషి చేశారు. మీ శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండా నింపుకొంటా. గత పదేళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. వేలాదిమంది ఈ శుభకార్యక్రమానికి హాజరై తెలంగాణకు పట్టిన చీడ, పీడ నుంచి విముక్తి కలిగించారంటూ’ సీఎం రేవంత్ భావోద్వేగ ప్రసంగం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం.. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తొలి మంత్రిమండలి కొలువుతీరింది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. తొలి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus Travel To Women), రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని (Aarogyasri Scheme) అమలు చేయనుంది. వచ్చే వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రజలు, పారిశ్రామిక సంస్థలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీ అని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 డిసెంబరు 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రూప్-1, 2 పరీక్షలపై ఒక నివేదిక తెప్పించుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిసెంబర్ 9న కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయని సమావేశంలో పేర్కొన్నారు.
గుర్తింపుకార్డు చూపించి ఉచిత ప్రయాణం..
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తొలుత రెండు గ్యారంటీలను మొదట అమలు చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ మొదటి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. వీటికి సంబంధించి శుక్రవారం ఆయా విభాగాలతో చర్చించి శనివారం (ఈ నెల 9వ తేదీ) నుంచే అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించనున్నారు. రేపట్నుంచి (డిసెంబర్ 9)నుంచి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆ వార్తలు నమ్మకండి.. మంత్రులకు శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్త ప్రభుత్వంలో మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఆయా మంత్రులకు ఫలానా శాఖలు కేటాయించారంటూ గురువారం నుంచి సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు నిజం కాదని, మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
