Viral Video: రోడ్లపై ప్రమాదకర రీతిలో పోకిరీల బైక్‌ స్టంట్లు.. పోలీసులకు ఫిర్యాదు

సోషల్‌ మీడియాలో లైక్‌ల మోజులో రెచ్చిపోతున్న కుర్రకారు

Share this :

Viral Video హైదరాబాద్‌, నవంబర్ 25: సోషల్ మీడియా (Social Media)లో లైకులు, కామెంట్లు, వ్యూస్‌ కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి.. రాత్రికి రాత్రే నేమ్.. ఫేమ్‌.. తెచ్చుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. రోడ్ల (Roads)పై బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ఖాళీగా ఉన్నా, రద్దీగా ఉన్నా తమకేం సంబంధం లేదన్నట్లు అత్యంత వేగంగా ద్విచక్ర వాహనాలు (Bike) నడుపుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. నగరంలోని రోడ్లన్నీ తమవే అన్నట్టు ఇష్టారీతిలో బైక్ స్టంట్లు (Bike Stunts) చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)లో ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన రీతిలో చేసిన బైక్ స్టంట్ వీడియో (Viral Video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ముందున్న రహదారి ఎప్పుడూ బిజీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎల్లప్పుడూ పోలీస్ భద్రతతో, సీసీ కెమెరాల నిఘాలో ఉండే సెక్రటేరియట్ వద్ద ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని ఒంటికాలిపై వేగంగా నడుపుతూ హల్‌చల్‌ చేశాడు. అది చూసిన ఇతర వాహనదారులు బెంబేలెత్తిపోయారు.

సదరు యువకుడి బైక్‌ విన్యాసాల వల్ల అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు లోనయ్యారు. యువకుడు ప్రమాదకర రీతిలో బైక్‌ నడుపుతూ.. విన్యాసాలు చేస్తుంటే.. అతని స్నేహితులు వీడియో చిత్రీకరిస్తూ కనిపించారు. అనంతరం ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశారు. దీంతో చెర్రెత్తుకొచ్చిన ఓ వాహనదారుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు.

చదవండి: Mansoor Ali Khan Public Apology: ఎట్టకేలకు నటి త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్‌ అలీఖాన్.. అసలేంటీ వివాదం?

దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆ యువకుడు నడిపిన బైక్ నెంబర్ ఆధారంగా అతని గుర్తించి కేసు నమోదు చేశారు. సదరు యువకుడికి ఇంస్టాగ్రామ్‌లో రేహన్ రైడర్ పేరిట ఖాతాలో ఉంది. ఆ ఖాతాలో తాను చేసిన బైక్ విన్యాసాలు, స్టంట్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. కేవలం సెక్రటేరియట్ వద్ద మాత్రమే కాకుండా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిపై కూడా ఇదే తరహా ప్రమాదకర విన్యాసాలు చేసినట్లు ఈ వీడియోల ద్వారా తెలుసుస్తోంది.

మరోవైపు బైక్ స్టంట్‌లపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. రోడ్లపై ప్రమాదకర రీతిలో స్టంట్లు చేసే యువకులపై కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది యువకుల్లో మార్పు రావడం లేదు. బైక్ స్టంట్లు చేస్తూ తాము ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తలపెట్టేలా ప్రవర్తిస్తున్నారు. వాహనదారులను ఇబ్బంది పెట్టే విధంగా స్టంట్లు చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.