Barrelakka in Telangana Politics: పాపం బర్రెలక్క..! ఓవైపు తాగుబోతు తండ్రి వీడియోలు.. మరోవైపు యాంటీ మీడియా బెదిరింపులు..

తమకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంటూ యూట్యూబ్‌ ఛానెళ్ల విషప్రచారం

Share this :

Barrelakka in Telangana Politics కొల్లాపూర్‌, నవంబర్‌ 26: బర్రెలక్క.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగుతున్న పేరు ఇది. బర్రెలక్క (Barrelakka) డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే గేదెలు కాస్తూ బతుకుతున్నానంటూ గతంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ 26 ఏళ్ల యువతి అసలు పేరు కర్నె శిరీష (Karne Sirisha). ప్రస్తుతం ఆమె నాగర్‌కర్నూల్‌ జిల్లా (Nagar Kurnool Dist) కొల్లాపూర్‌ (Kollapur) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఒంటరి యువతి రాజకీయాలోకొస్తే ఎంత నగబాటు చేస్తారో బర్రెలక్కను చూస్తుంటే అవగత మవుతుంది. ఓ పక్క తాగుబోతు తండ్రి ద్వారా విడుదల చేస్తున్న వీడియోలు, మరోవైపు యాంటీ మీడియా.. తలోవైపు నుంచి బర్రెలక్క అలియాస్‌ శిరీష (Barrelakka alias Karne Sirisha)ను బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు (YouTube Channels) తమకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదంటూ ఆమెను టార్గెట్‌ చేస్తూ నీచాతినీచంగా దుష్ర్పచారం చేస్తున్నాయి. బెదిరించి మరీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి.

బర్రెలక్క (Barrelakka)పై యాంటీ మీడియా విష ప్రచారం..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన నియోజకవర్గంలో (Barrelakka in Telangana Politics) ప్రచారం చేస్తూ శిరీష బిజీగా ఉంటే.. మరోవైపు తమకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు,శాటిలైట్‌ ఛానెల్స్‌ సైతం ఆమెను టార్గెట్‌ చేస్తూ, ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఆమె ఒంటరిగా చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సింది పోయి.. మీడియాలో చెడుగా ప్రచారం చేస్తున్నారు. కటిక పేదరాలు అయిన శిరీష చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా,ప్రజలు ఆర్థిక, ఇతర వనరులు సమకూర్చడంతో సన్నిహితులు, మద్దతుదారులతో ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో అందరికీ సమయం కేటాయించలేదు. అందరికీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. దీనిని ఆసరాగా చేసుకుని యాంటీ మీడియా ఆమె గురించి తప్పుగా ప్రచారం చేస్తూ, బ్లాక్‌ మెయిల్‌కు దిగుతున్నారు. ఓ వైపు తాగుబోతు తండ్రి వీడియోలు, మరోవైపు యూట్యూబ్‌ ఛానెళ్ల వేధింపులు ఆమెకు ఎక్కువయ్యాయి.

కాగా అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ అగ్రికల్చర్ పూర్తి చేసిన శిరీష.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు పోరాటం చేస్తానని ప్రచారం చేస్తుంది. చేతిలో కేవలం రూ.5 వేలు, బ్యాంకు ఖాతాలో రూ.1500 ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతో పలువురు ఆమె ప్రచార ఖర్చులకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం లెక్కలేనంత ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో 1.66 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.97 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.12 లక్షల మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. శిరీషకు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. శిరీష తల్లి పెద్దకొత్తపల్లిలో ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాన్ని నడుపుతున్నారు. వీరి కుటుంబానికి అదే జీవనాధారం. ఓట్లడిగితే డబ్బులడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానంటూ ఇంటింటికి తిరిగి శిరీష అభ్యర్ధిస్తోంది.

చదవండి: Mansoor Ali Khan Public Apology: ఎట్టకేలకు నటి త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్‌ అలీఖాన్.. అసలేంటీ వివాదం?

అదే జరిగితే నేతల వెన్నులో ఒణుకు పక్కా..

సరదాగా వేసిందో, తన అసహనాన్ని తెలిపేందుకు వేసిందో తెలియదు గానీ నామినేషన్‌ వేసిన తర్వాత ఆమెకు ఊహించని రీతిలో ప్రజామద్ధతు లభించింది. కేవలం యువత నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లోనే బర్రెలక్క ఓ సంచలనంగా మారింది. పార్టీలకతీతంగా కొందరు రాజకీయ నాయకులు సైతం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ గెలవాలని కోరుకుంటున్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ, అమరావతి JAC బాలకోటయ్య కూడా తమ మద్ధతు తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ (RGV) కూడా బర్రెలక్కను ప్రశంసిస్తూ ట్వీట్ చేసాడు. ‘బర్రెలక్క నేటి మహాత్మా గాంధీ .. అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ కూడా తన విప్లవ ఉద్యమాన్ని బర్రెలక్క లాగానే ప్రారంభించారంటూ’ ఎక్స్ లో తాజాగా పోస్ట్‌ పెట్టాడు.

దీంతో ఒంటరిగా నామినేషన్‌ వేసిన బర్రెలక్క (Kollapur MLA) వెంట ఇప్పుడు ఓ సైన్యమే ఉందని చెప్పాలి. బెదిరింపు ఫోన్‌ కాల్స్ వచ్చినా, దాడులు జరిగినా, పోలీసులు రక్షణ కల్పించకపోయినా.. మొక్కవోని ధైర్యంతో.. తనతో కలిసి నడుస్తున్న యువతే కొండంత అండగా ముందుకు సాగుతోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమట్లు పడుతున్నాయి. ఒకవేళ ఆమె గెలిస్తే అసెంబ్లీలో

అడుగుపెట్టే దేశంలోనే అతిపిన్న వయసున్న ఎమ్మెల్యేగా సంచలనంగా మారుతుంది. మిగతా 118 ఎమ్మెల్యేలకు సమానంగా అసెంబ్లీలో కూర్చోనుంది. అంతేకాకుండా కడుపుకాలిన బర్రెలక్క లాంటి యువత భవిష్యత్తులో మరింత మంది అసెంబ్లీకి వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరిక కానుంది. కొల్లాపూర్‌లో ఉన్న 88 వేల ఓట్లలో మెజార్టీ ఓట్లు బర్రెలక్కకు వేసి గెలిపించుకోవాలని నియోజకవర్గ యువత భావిస్తున్నారు. ఒకవేళ బర్రెలక్క విజయం సాధిస్తే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం పక్కా అంటూ విశ్లేషకులు అంటున్నారు

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.