TS CEO Vikas Raj: ‘రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం.. ఆ 49 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి’ సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడి

తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.. ఆ తర్వాతే

Share this :

TS CEO Vikas Raj హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: రాష్ట్రం (Telanagana)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో వచ్చిన ఓట్ల లెక్కింపు (TS Assembly Election Results 2023)కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ (Telangana Chief Election Officer Vikas Raj) శుక్రవారం (డిసెంబర్ 1) తెలిపారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామన్నారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందని తెలిపారు. 500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం (December 3) ఉదయం 8 గంటలకు పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక్కో సబ్‌ ఎగ్జామినర్‌ ఉంటారని తెలిపారు.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొత్తం 1.80 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉందని, వీటి లెక్కింపు ప్రక్రియ 8.30 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల కౌటింగ్‌ పూర్తికాకపోతే రెండింటినీ సమాంతరంగా లెక్కిస్తారని తెలిపారు. పరిశీలకుల ఆమోదం తరవాతే ఫలితాలను వెల్లడిస్తారని ఆయన స్ఫష్టం చేశారు.

నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగగా.. ఆ రోజున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో సుమారు 13 వేల వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. 2018 ఎన్నికల్లో కేవలం 2,400 మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ అయ్యాయని, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. కొందరు మంత్రులపై కూడా కేసులు నమోదు చేశామని వికాస్‌రాజ్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.