Telangana Election Result 2023 Highlights హైదరాబాద్ డిసెంబర్ 4: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections 2023) పండగ దాదాపు ముగిసిపోయినట్లే. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత పదేళ్లుగా మకుటంలేని మహారాజుగా ఏకచక్రాధిపత్యం కొనసాగించిన కేసీఆర్ సర్కార్ (KCR Government) పరాజయం పాలైంది. పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వచ్చే సానుకూల ఓటుతో తప్పక విజయం సాధిస్తామనే ఆ పార్టీ అంచనాలు (Telangana Assembly Election Results 2023) ఘోరంగా తలకిందులయ్యాయి.
మూడోసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనే ఆ పార్టీ లక్ష్యాన్ని ప్రజాతీర్పు దెబ్బకొట్టింది. ఉద్యోగ నియామకాల విషయంలో విఫలమైన బీఆర్‌ఎస్ (BRS)కు యువత నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. పైగా పథకాల అమలులో లోపాలు, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత.. వెరసి బీఆర్‌ఎస్ (BRS) ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. మొత్తం 119 స్థానాలకు కేవలం 39 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో గెలిచిన 49 స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. (2014లో 63 స్థానాలు బీఆర్‌ఎస్‌కు దక్కాయి. 2018లో 88 స్థానాలతో అధికారం చేపట్టింది)
పైగా ఈసారి కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయగా కామారెడ్డిలో ఓడిపోయారు. అలాగే ఆరుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. దళితబంధు, బీసీబంధు పథకాలను ప్రకటించిన కొద్ది మందికే లబ్ధి చేకూరింది. దీంతో మిగిలిన వారిలో అసంతృప్తి , ఆగ్రహానికి కారణమైంది. డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్లు కూడా కొద్ది మందికే దక్కాయి. పథకాల వైఫల్యం ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
ఆరు స్థానాలు బీఆర్‌ఎస్‌కు కొరుకుడుపడ లేదు
2001లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి గోషామహల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేటలలో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ గెలిచిన దాఖలాలు లేవు. సాధారణ, ఉప ఎన్నికలు.. అన్నింటిలోనూ ఆ ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది లేదు.
కాంగ్రెస్‌కు జైకొట్టిన ఓటరు
కాంగ్రెస్ మొత్తం 65 స్థానాలు దక్కించుకుని గెలుపు కైవసం చేసుకుంది. 2014లో 21 స్థానాలు, 2018లో 21 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రతినిధిబృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజేస్తారు. అందిన సమాచారం మేరకు పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
ఆదివారం వెలువడిన ఫలితాల్లో సీపీఐతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 65 స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్ ప్రకటించారు. అయితే అంతవరకు ఆగకుండా సోమవారమే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. కాగా సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశం జరగనుంది.
బోణీ కొట్టని జనసేన..
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీచేసిన జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థులందరూ డిపాజిట్‌లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో జనసేన భాజపాతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 11 స్థానాల్లో పోటీచేయాలని తొలుత భావించినా తర్వాత 8 స్థానాలకు ఖరారు చేశారు. ఆ మేరకు కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. కాగా అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కూకట్‌పల్లి అభ్యర్థి మూమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రం అత్యధికంగా 39,830 ఓట్లు వచ్చాయి. మిగిలిన అన్ని స్థానాల్లో ఐదువేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ 2014లో 20 స్థానాలు, 2018లో ఒకటి, 2023లో 8 స్థానాలు గెలుచుకుంది.
మిగిలిన మూడు రాష్ట్రాల్లో కమలం హవా
ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది
*చత్తీస్‌ఘడ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలవగా, బీజేపీ 54 స్థానాల్లో అత్యధికత సాధించింది.
*మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 66 స్థానాలు, బీజేపీకి 163 స్థానాలతో భారీ గెలుపు సొంతం చేసుకుంది.
*ఇక రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు గానూ 69 స్థానాలు కాంగ్రెస్ గెలవగా, బీజేపీ మొత్తం 115 స్థానాలను సొంతం చేసుకుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
