Barrelakka Election Results 2023: హేమాహేమీలకు చెమటలు పట్టించిన బర్రెలక్క.. మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

ఓడినా తిరుగులేని గుర్తింపు దక్కించుకున్న బర్రెలక్క

Share this :

Barrelakka Election Results 2023 మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 4: తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results) హేమాహేమీలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిన పేరు బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష (Barrelakka). తెలంగాణ ఎన్నికల 2023 (Telangana Elections 2023) ముందు ఆమె పేరు పెద్దగా తెలియదు. సోషల్‌ మీడియాలో కొందరికే పరిచయస్థురాలు. నిరుద్యోగి అయిన ఈ యువతి 2022 డిసెంబరులో విడుదల చేసిన అర నిముషం వీడియో సోషల్‌ మీడియా (Social Media)లో స్టార్‌ని చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అంతే ఆ వీడియో నెట్టింట రామబాణంలా దూసుకుపోయింది. అయితే ఈ వీడియో పోస్ట్‌ చేసిన తర్వాత ఆమెపై కేసు కూడా నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నావంటూ పెద్దకొత్తపల్లి ఠాణాలో కేసు పెట్టారు. ఆ తర్వాత వరుస వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది.

ఇక తాజా ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ (Kollapur) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. నిరుద్యోగుల తరపున పోటీ చేస్తున్నానని నామినేషన్‌ వేసింది. ఆమె ధైర్యాన్ని, తెగువను నెటిజన్లతో పాటు తెలుగు ప్రజలు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇక ఆమె ఉండే తడికల ఇల్లు.. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా డబ్బులు లేని కడు పేదరికం.. ప్రజల మనసులను చూరగొన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం సాగించిన ఆమెకు ఊహించని రీతిలో ఆయా వర్గాల నుంచి అద్భుతమైన మద్ధతు లభించింది. కొంత మంది స్పచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె తరపున ప్రచారం చేశారు. మరికొందరైతే నిధులు కూడా సమకూర్చారు.

కొల్లాపూర్‌లో కారుకు బ్రేకులు.. గట్టిగానే దెబ్బ కొట్టిందిగా..!

పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా బర్రెలక్కకు ఓట్లు బాగానే పడినట్లు పాజిటివ్‌గా తేల్చాయి. అనుకున్నట్లుగానే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీచేసిన బీరం హర్ష వర్ధన్ రెడ్డి (BRS MLA Beeram Harshavardhan Reddy)ని ఎన్నికల్లో బర్రెలక్క గట్టిగానే దెబ్బకొట్టింది. సీన్ కట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకతతో శిరీషకు అనుకున్నదానికంటే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దాదాపు 5,574 ఓట్లు విజిల్ గుర్తు ( (Kollapur Assembly Election Results 2023))కు పడటంతో నాలుగో స్థానంలో నిలిచింది. బ్యాలెట్ ఓట్లలోనూ బర్రెలక్క ముందంజలోకి రావడం నేతల్లో వణుకు పుట్టించింది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఇటు సాధారణ ఓట్లలో అనుకున్నదానికంటే బర్రెలక్కకు ఎక్కువ ఓట్లు రావడంతో కారు పార్టీని తుస్సుమనిపించింది. ఇదే ఓట్లు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థికి పోలై ఉంటే.. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేది. ఎలాగైతేనేం.. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఓటమికి బర్రెలక్క గట్టిగానే కారణమైందని రాజకీయ విశ్లేషకులు, స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినా సరే యావత్ తెలంగాణ ప్రజల మనసు గెలిచిందంటూ బర్రెలక్కను పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే బర్రెలక్క ఓటమితో సరిపెట్టుకుంటుందా? లేదంటే రాజకీయాల్లో కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి..

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.