Hyderabad: కల్తీ.. దందాకు అడ్డుకట్టేది? పెయింట్స్‌లో వాడే కెమికల్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్టు!

హైదరాబాదీలు జరభద్రం! ప్రాణాంతక రసాయనాలతో ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి..

Adulterated Ginger Garlic Paste Racket
Share this :

హైదరాబాద్‌, సెప్టెంబర్ 27: సిటీ.. విలేజ్‌.. అనే తేడా లేకుండా ప్రతిచోటా ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌ రాజ్యమేలుతోంది. వాటి తయారీకి వాడే పదార్ధాలు కల్తీ, నాసిరకం కావడమే అందుకు నిదర్శనం. అధికారుల నిఘా కొరవవడంతో వ్యాపారులు యదేచ్ఛగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు మార్కెట్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఉప్పు, పప్పు.. మొదలుకొని అల్లం, బెల్లం దాకా ఏది కొన్నాలన్నా కల్తీ భయం వేధిస్తోంది. అంత కల్తీ మయమైపోయింది. పరిగెడుతున్న కాలంలో మనమంతా ఇన్‌స్టంట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నాం. రెడీమేడ్‌గా దొరికే ఫుడ్‌ కోసం అర్రులు చాస్తున్నాం. దీనిని కల్తీ రాయుళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.

కల్తీ పదార్ధాలు ఎక్కువగా వినియోగిస్తోంది ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలోనే. ముఖ్యంగా ప్రతి వంటలో రుచి కోసం వినియోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీకి అడ్డాగా మారింది. దీంతో ప్రతిచోట అల్లం వెల్లుల్లి తయారీ కర్మాగారాలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్డుపక్కన ఉండే ఫుడ్ స్టాల్స్‌లలో అడ్డూఅదుపూ లేకుండా వాడేస్తున్నారు. తక్కవ ధరకే ఎక్కువ మొత్తంలో లభిస్తుండటంలో ఇన్‌స్టంట్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కొనేందుకు సామాన్య జనం కూడా ఎగబడుతున్నారు. ప్రొడక్ట్‌ తయారీ, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు చూసుకోకుండా అతి తక్కువ ధరకే లభిస్తుందంటే అందులో ఖచ్చితంగా నాణ్యత నూటికి నూరు శాతం ఉండదనేది జగమెరిగిన సత్యం.

పెయింట్స్‌లో వాడే రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ తయారీ..

నీతి బీరకాయ చందంగా అసలు అల్లం, వెల్లుల్లి వేయకుండానే కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి పొట్టు వేసి మంచి రంగు కోసం, రుచి కోసం, సువాసన వచ్చేందుకు అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్‌ నగర శివార్లలో కల్తీ దందా కేసులు వెలుగు చూశాయి కూడా. తాజాగా ఉప్పల్ పీఎస్ పరిధిలోని ఓల్డ్ రామంతపూర్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టు రట్టయ్యింది. దీనిపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు స్థానిక ఉప్పల్ పోలీసులతో కలిసి బుధవారం (సెప్టెంబర్ 27) దాడి చేశారు.

రుచి, సువాసన వెనుక అసలు మర్మం ఇదే..

టైటానియం డయాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను అల్లం వెల్లుల్లి పేస్టులో వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రబ్బర్, టెక్స్‌టైల్స్, పెయింట్స్, ఇంక్, పేపర్, సిరామిక్ తయారీలో వాడే రసాయనం ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో దీన్ని వాడటం వల్ల కుళ్ళిన ఆనవాళ్లు తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది. టైటానియం డయాక్సైడ్‌తోపాటు ఆరోగ్యానికి హాని కలిగించే సిట్రిక్ యాసిడ్ ఇతర రసాయనాలను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వీటిని తయారు చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ (25) అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. కర్మాగారంలో లభ్యమైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో సహా వీటిని తయారు చేసే రసాయనాలను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బయట హోటల్స్‌, రోడ్డుపక్కన అద్దాల వెనుక ఎర్రటి రంగులో కనిపించే చికెన్‌ పకోడి, సమోసాలు, బజ్జీలు తినే ముందు ఓ సారి ఆలోచించవల్సిందే.

రోగాలకు అడ్డాగా మారిన ఆహార కల్తీ రాకెట్లు

ఇలాంటి ఆహారాలు తినడం వల్ల పక్షవాతం, కడుపు ఉబ్బరం, అల్సర్‌, రక్తపోటు, గుండె జబ్బులు, చిన్నపేగు క్యాన్సర్‌, ట్రాన్స్‌ప్యాట్స్‌, అల్సర్‌, ఉదర సంబంధ క్యాన్సర్‌లొచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి హైదరాబాదీలు జర భద్రం! మీ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి..