కాంగ్రెస్ పై ఘాటుగా వ్యాఖ్యనించిన ఎమ్మెల్సీ కవిత….!!

Share this :

భాజపాతో అవగాహన కుదిరినందుకే కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు కదలడం లేదా?అని భారాస నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఏమైందని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా మధ్య అవగాహనేమిటో బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతమంటూ ఎద్దేవా చేసిన కవిత.. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ, ప్రజలను మరోసారి మభ్యపెట్టొద్దని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని మరో రాష్ట్రంలో అవే పార్టీలను వ్యతిరేకిస్తుందన్నారు. ఒక ప్రాంతంలో ఆప్‌తో కొట్లాడుతూ మరో చోట అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ ఇతర రాష్ట్రాల్లోనేమో వ్యతిరేకిస్తున్నారని కవిత విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత, ద్వంద్వ విధానాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు.

మరోవైపు, 20 ఏళ్లుగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలంటూ ప్రతిపాదించిన 9 అంశాల్లో మహిళా బిల్లును సోనియా ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే భారాస ప్రభుత్వం తీర్మానం చేసిందని కవిత పేర్కొన్నారు. ఇవాళ భారాస పార్లమెంటరీ పార్టీ దీనిపై మరోసారి తీర్మానం చేసిందని, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని కూడా ఆమె చెప్పారు.