నీట్ రీ-ఎగ్జామ్ కోసం రంగంలోకి ఆర్మీ..?

జూన్ 21 పరీక్షపై కేంద్రం సంచలన ప్లాన్

Share this :
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. దేశంలోనే అతిపెద్ద ఆఫ్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ మరియు అక్రమాల కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్‌ను ఎలాంటి తప్పులు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రం ఏకంగా భారత సాయుధ బలగాల (మిలిటరీ) సహాయాన్ని తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

Also Read: జగన్ కోటరీ విచ్ఛిన్నం.. ఒక్కొక్కరిపై తిరుగుతున్న ‘సిట్’ చక్రం..!

విద్యాసంబంధిత ప్రవేశ పరీక్ష కోసం దేశంలో ఆర్మీ సహాయం కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ వ్యూహాత్మక ఏర్పాట్లపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో గురువారం ఒక హై-లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), విద్యాశాఖకు చెందిన టాప్ అఫీషియల్స్ పాల్గొన్నారు. క్వశ్చన్ పేపర్ల తయారీ, ప్రింటింగ్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు వాటిని సురక్షితంగా రవాణా చేయడం, భద్రత కల్పించడం వంటి పూర్తి విధివిధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
అయితే, ఎగ్జామ్ హాల్స్ పర్యవేక్షణలో గానీ, వాల్యుయేషన్‌లో గానీ మిలిటరీ జోక్యం ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ పాత్ర కేవలం లాజిస్టిక్స్ (రవాణా, భద్రత) పరిధికి మాత్రమే పరిమితం కానుంది. జూన్ 21 నాటికి దేశంలో నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు లేదా తుఫానులు వచ్చి రోడ్డు రవాణా స్తంభిస్తే.. అత్యవసర పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్లను ఎయిర్ లిఫ్ట్ చేయడానికి వాయుసేన (Air Force) సహాయాన్ని వినియోగించుకోనున్నారు.

Also Read: వైఎస్ షర్మిలకు రాజ్యసభ దక్కితే.. వైసీపీకి జరిగే 5 నష్టాలు ఇవే..!

ఆర్మీతో పాటు హోం శాఖ, ఐటీ శాఖ, పోస్టల్, సివిల్ ఏవియేషన్ విభాగాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. మరోవైపు నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్ష కావడం, ఇప్పటికే ఎన్‌టీఏ ప్రతిష్ట దెబ్బతినడంతో.. ఈసారి ‘జీరో-ఎర్రర్’తో పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అసాధారణమైన సాహసోపేత చర్యలకు సిద్ధమవుతోంది.

leave a reply