ప్రైవేట్ స్కూళ్ల ‘బుక్స్’ దందా, ఎన్హెచ్ఆర్సీ సీరియస్..!

ప్రైవేట్ స్కూళ్ల 'బుక్స్' దందా

Share this :

ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొరడా ఝుళిపించింది. ప్రైవేట్ స్కూళ్లు అధిక ధరలకు ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను కొనాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి ఎంపిక చేసిన దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని నిబంధనలు పెడుతున్నట్లు మానవ హక్కుల కమీషన్ కు భారీగా ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలకు బదులు, కమీషన్ల కోసం ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను ప్రవేశపెట్టి సామాన్య తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

‘జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం’ అమలు చేయాలి

ప్రభుత్వాలు ఇప్పటికైనా నిద్ర మేల్కొని ‘జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం’ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఈ పాలసీ ప్రకారం, స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి బరువులో 10 శాతం కంటే మించకూడదు, అనవసరమైన ప్రైవేట్ పుస్తకాలను రుద్ది విద్యార్థులపై భారం పెంచకూడదు, పుస్తకాల ఎంపికలో పారదర్శకత ఉండాలి.

నివేదిక కోరిన మానవ హక్కుల కమీషన్

ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి..? ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్లపై తనిఖీలు చేశారు? అనే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాణిజ్య ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని హెచ్చరించింది. మానవ హక్కుల కమీషన్ జోక్యంతోనైనా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తారని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.