నెల్లూరు, డిసెంబర్ 5: మిచౌంగ్ తుపాను (Cyclone Michaung Today) తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపాను (Michaung) కారణంగా కోస్తాంధ్ర (cyclone michaung in AP)తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని (cyclone updates) వాతావరణ శాఖ (IMD)తెలిపింది. కొంతభాగం సముద్రంలో, మరికొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రతకు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఆ జిల్లాలో తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.

తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా సరఫరా లేదు. తుపాను ప్రభావంతో వీస్తున్న గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. పలుచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది. మరోవైపు మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. గన్నవరం నుంచి నడిచే 15 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, షిర్డీ, కడప, ఢిల్లీ విమానాలు రద్దు అయ్యాయి. విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను తీరం దాటే సరికి భారీ విధ్వంసం జరుగుతుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. తుపాను విజిలెన్స్పై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చదవండి: Medak woman Murder Case: యువతి దారుణ హత్య.. సగం కాలిన స్థితిలో రహదారి పక్కన లభ్యం
తెలంగాణలోనూ మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్..
కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం ఆనుకొని నెల్లూరు నుంచి బందరువైపు సాగుతున్న మిచౌంగ్ తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నగరంలో ఈ రోజు తెల్లవారుజామున ఈదురు గాల్లులతో కూడిన వర్షం కురిసింది. ఓ వైపు చలి మరోవైపు వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున హయత్ నగర్, వనస్థలిపురం, బంజర హిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, మెహదీపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్.. పలు ప్రాంతాల్లో గత రాత్రి భారీ వర్షం పడింది. ఇదే మదిరి రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. వర్షాల దృష్ట్యా నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని హెచ్చరికలు జారీచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
