Rajampet Politics: టీడీపీలోకి మేడా మల్లికార్జున రెడ్డి?

టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు!

Share this :

వైసీపీని వీడి సైకిలెక్కనున్న రాజంపేట ఎమ్మెల్యే

జగన్ టికెట్ ఖరారు చేసినా అడ్డుపడ్డ ఎంపీ మిథున్ రెడ్డి

జగన్ సొంత జిల్లాలో రాజంపేట ఎంపీ మాటకేనా విలువ?

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం?

అటు టీడీపీ నుంచి కూడా సానుకూలత.. ?

గతంలో టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చిన మేడా

కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గతంలో టీడీపీ నుంచే వచ్చిన ఆయన మళ్లీ సొంత ఇంటికి వెళ్లనున్నారు. దీనివెనుక అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిటింగ్ ఎమ్మెల్యే అయిన మేడాకు.. మొదట వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రాజంపేట టికెట్ ను ఖరారు చేశారు. ‘‘అన్నా.. సీటు నీకే.. బాగా పనిచేసుకుని గెలుచుకునిరా’’ అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో ధీమా ఉన్న మల్లికార్జునరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జోక్యం చేసుకుని.. జగన్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి మేడా టికెట్ ను అడ్డుకున్నారు .ఈ హఠాత్ పరిణామంతో మేడా మల్లికార్జునరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.

మిథున్ రెడ్డి గెలిపించడంలో మేడా పాత్ర కీలకం

సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప..ఇక్కడినుంచి ఎంపీ అయిన మిథున్ రెడ్డిది పొరుగు జిల్లా అయిన చిత్తూరు. అక్కడినుంచి వచ్చిన ఆయనను ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట ఎంపీగా గెలిపించడంలో మేడా పాత్ర కీలకం. ఆర్థికంగా బలవంతుడైన మేడా రాజకీయంగానూ ఎదిగితే తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించి ఆయన టికెట్ ను రాకుండా అడ్డుపడినట్లు సమాచారం. దీనివెనుక మిథున్ రెడ్డి మంత్రాంగం ఉందనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. మరోవైపు మిథున్.. మేడా స్థానంలో తనకు పెద్దగా ఇబ్బందికాని అభ్యర్థిని తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఖిన్నుడైన మేడా.. టీడీపీలోకి జంప్

ముందునుంచి తనకు టికెట్ ఖాయం అనుకుంటున్న ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అటు ప్రజల్లోనూ సానుకూలత ఉండి.. తన గెలుపు ఖాయమైన పరిస్థితుల్లో ఎదురైన అనుభవం ఆయనను ఖిన్నుడిని చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అటు టీడీపీ నుంచి కూడా మేడా రాకపై సానుకూలత వ్యక్తమైంది. దీంతోపాటు రాజంపేట టికెట్ ను మేడా మల్లికార్జున రెడ్డి కూడా ఆశించవచ్చు.. కాగా, మేడా మల్లికార్జున రెడ్డి గతంలో టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చారు. మళ్లీ సొంతగూటికి వెళ్తున్నారు. మరోవైపు మేడా టీడీపీలోకి వెళ్లనుండం రాజంపేట పరిసర నియోజకవర్గాలపైనా ప్రభావం చూపనుంది.