సరిగ్గా రెండు నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల పునర్ విభజన.. డీలిమిటేషన్ బిల్లు – 2026 కు పార్లమెంట్‌లో బ్రేకులు పడ్డాయి. అయితే ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్ 18 నాటి మాట. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులకు పార్లమెంట్‌లో విపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఆమోదం పొందలేదని.. అప్పట్లో ఎన్‌డీఏ కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వల్లే ఈ బిల్లులకు ఆమోదం లభించలేదంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. దీనిపై తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం ఎన్నికల్లో ప్రధాని మోదీ సైతం పదే పదే ప్రస్తావించారు. అయితే ఇదంతా రెండు నెలల క్రితం మాట.
దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నాడు మోదీ సర్కర్‌ను తప్పుబట్టిన వారే.. ఇప్పుడు ఆయనకు అండగా నిలుస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే బెంగాల్ హ్యాట్రిక్ సీఎం మమతా బెనర్జీ ఓడిపోయారు. అక్కడ తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మార్పు.. రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేశాయి. తమిళనాడులో నిన్నటి వరకు పొత్తులో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ బంధం తెగిపోయింది. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే అధినేత స్టాలిన్.. హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసి.. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో చేరనున్నారు.
ఇక బెంగాల్‌లో ప్రభుత్వం మారిన తర్వాత మమతా బెనర్జీకి కష్టాలు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రమంగా ఆ పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పుడు ఏకంగా 20 మంది తృణమూల్ ఎంపీలు తాము పార్టీ వీడుతున్నట్లు తెలియటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వీరంతా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు కనీసం గుర్తింపు కూడా ఉండదు. ప్రస్తుతం ఈ సమీకరణలు మోదీ సర్కార్‌కు బాగా కలిసి వస్తున్నాయి. వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు మరోసారి సభలోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈసారి అటు డీఎంకే, ఇటు తృణమూల్ సభ్యుల అండతో.. ఈ బిల్లులు సులువుగా ఆమోదం పొందుతాయని కాషాయ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
