Amaravati: ఆ విషయంలో కూటమి పూర్తిగా ఫెయిల్..!

తిప్పికొట్టడంలో టీడీపీ నేతలు విఫలం

Share this :

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండేళ్లు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఆయన అహోరాత్రులు కష్టపడుతున్నారని కూటమి నేతలతో పాటు ప్రజలు కూడా చెబుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైందని.. పారిశ్రామిక వేత్తలను బెదిరించడంతో పెట్టుబడులు రాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వ్యాపారవేత్తలకు భరోసా ఇస్తూ.. వారికి నమ్మకం కలిగిస్తూ.. ఏపీ వైపు చూసేలా చంద్రబాబు కష్టపడుతున్నారని పదే పదే చెబుతున్నారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకోవటంలో టీడీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.

ఏ రాజకీయ పార్టీకి అయినా సరే.. ప్రచారమే ప్రధానం. తాము చేసిన పనులు చెప్పుకుంటేనే.. తర్వాత ఎన్నికల్లో ఓట్లు వస్తాయి. అందులో రాజకీయ పార్టీల నేతలు ఎన్నో మాటలు చెబుతుంటారు కూడా. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేయని పనులను కూడా చేసినట్లు ఫేక్ ప్రచారం చేసుకుంది. కానీ.. ఇప్పుడు కూటమి సర్కార్ మాత్రం.. కనీసం చేసిన, చేస్తున్న పనులను కూడా చెప్పుకోలేక పోతోంది. ఇక ఇదే సమయంలో వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై పదే పదే చేస్తున్న అవినీతి ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టడంలో మంత్రులు, టీడీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారనే మాట బాగా వినిపిస్తోంది.

తాజాగా అమరావతికి కేంద్ర మంత్రిమండలి భారీ ప్రాజెక్టు మంజూరు చేసింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,299 కోట్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు రూ.1,235 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. మొత్తం 5.5 ఎకరాల్లో జీ ప్లస్ 13 అంతస్తులతో సెక్రటేరియట్ కాంప్లెక్స్, 17 ఎకరాల్లో 11 టవర్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగు రూ.5,587, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు రూ.3,945 చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించింది.

నిజానికి కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత ముందుగా మీడియా ముందుకు రావాల్సింది టీడీపీ నేతలు. కేంద్రం అండతో అమరావతికి, ఏపీకి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని ప్రజలకు వివరించాలి. కానీ కేంద్రం ప్రకటించిన వెంటనే ముందుగా రంగంలోకి దిగారు వైసీపీ నేతలు. అమరావతిలో అవినీతి అంటూ తాము చేస్తున్న ఆరోపణలను కేంద్రం లెక్కలతో సహా బయటపెట్టిందంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగు కోసం రూ.4 వేలు లోపే ఖర్చు చేస్తుంటే.. కూటమి ప్రభుత్వం ఇదే రాజధానిలో మూడు, నాలుగింతలు ఎక్కువ ఖర్చు చేస్తోందని ఆరోపిస్తున్నారు. సచివాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.20 వేల చొప్పున ఖర్చు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

అయితే వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టడంలో టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజలకు వాస్తవ లెక్కలు వివరించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే. అందులో మౌలిక వసతుల ప్రస్తావన లేదు. కానీ ఏపీ సచివాలయ శాశ్వత భవనాల నిర్మాణ లెక్కల్లో మౌలిక వసతులు కూడా అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ప్రభుత్వ, టీడీపీ పెద్దలు ప్రజలకు వివరించటం లేదు. ఈ నిర్మాణంలో భూ సేకరణ వ్యయం కూడా ప్రస్తావించారు. అందుకే దీని ఖర్చు రెట్టింపు స్థాయిలో ఉంది. ఇంత చిన్న లాజిక్‌కు వివరిస్తూ.. వైసీపీ నేతల ఆరోపణలకు ధీటుగా జవాబివ్వటం లేదు. మంత్రి నారాయణ కూడా ఏదో చెబుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చేసింది చెప్పుకోలేకపోగా.. నిజాలను కూడా ప్రజలకు వివరించలేకపోతే.. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

leave a reply