ఏమిరా బాలరాజు.. నీ వల్ల దేశానికి ఉపయోగం.. అనే డైలాగ్ అందరికీ గుర్తే.. రవితేజ హీరోగా వచ్చిన అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోది ఈ డైలాగ్. ఏదైనా పనిని ఎద్దేవా చేయడానికి లేదా సరదాగా ప్రశ్నించడానికి ఒక పాపులర్ మీమ్ డైలాగ్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలకు సరిగ్గా సరిపోతుంది. టీమ్ 2029 అంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల ప్రకటన చేశారు. అయితే ఈ కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే యువతకు, మహిళలకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. అయితే ఇలా పదవులు దక్కిన వారంతా ఏమయ్యారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
రాజకీయ పార్టీల్లో అత్యంత కీలకమైన విభాగం అధికార ప్రతినిధులు. పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రతిపక్షాలకు కౌంటర్.. ఇలా ఎన్నో విషయాలను ప్రజలకు వివరించడంలో అధికార ప్రతినిధులదే కీలక పాత్ర. పైగా నిత్యం మీడియా ముందు కనిపించడం వల్ల వీరికి ప్రజల్లో కూడా మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఆయనను హత్య చేసేందుకు కూడా యత్నించారు. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన నాటి వైసీపీ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేయడమే.
ప్రస్తుతం టీడీపీ ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందిని నియమించారు. వారిలో కూన రవికుమార్, కావలి గ్రీష్మ, చల్లారపు రామ్మోహన్ నాయుడు, సుంకర పావని, గొల్లపల్లి అమూల్య, దాసరి శ్యామ్ చంద్రశేషు, డూండి రాకేశ్, ఎంఎస్ బేగ్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పర్చూరి రమ్య, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాశ్ ఉన్నారు. వీరు బాధ్యతలు చేపట్టి ఇప్పటికే నెల రోజులు దాటి పోయింది కూడా. కానీ ఇప్పటి వరకు వీరంతా ఎక్కడున్నారో.. ఏమయ్యారనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. నెల రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా వీరు పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పకొట్టలేదు.
ప్రస్తుతం డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. టీచర్ పోస్టులను అమ్ముకున్నారని.. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ప్రభుత్వం తరఫున విద్యా శాఖ అధికారులు, డీఎస్సీ అభ్యర్థులు ముందుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అలాగే టీడీపీ అనుకూల మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. కానీ అధికార ప్రతినిధుల్లో కనీసం ఒక్కర కూడా ఇప్పటి వరకు వైసీపీ నేతలకు సమాధానం ఇవ్వలేదు. టీడీపీ తరఫున స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మేడా విజయశేఖర్ రెడ్డి ( రాజంపేట) మాత్రమే మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు తప్ప.. ప్రస్తుత అధికార ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్ పదవులు అనుభవిస్తున్న వారిలో కనీసం ఒక్కరు కూడా బయట కనిపించటం లేదు. దీంతో ఇలాంటి వారికి పదవులు ఇవ్వటం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని.. పైగా వీళ్ల వల్ల నష్టం జరుగుతుందని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఏమిరా బాలరాజు.. వీళ్ల వల్ల పార్టీకి ఉపయోగం.. అని సెటైర్లు కూడా వేస్తున్నారు
