Andhra Pradesh: సీయం చంద్రబాబులో మార్పు రాదా..?

సచివాలయం ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల్లో చర్చ

Share this :

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల వరకు ఆఫీసులో ఏ టెన్షన్‌లు లేకుండా ఐఏఎస్ అధికారులు ప్రశాంతంగా పని చేసుకున్నారంట. ఆ సమయంలోనే సమీక్షలు, సమావేశాలు జరిగాయంట. అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేవలం ఆఫీసు సమయంలో మాత్రమే అధికారులకూ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు కాలం మారింది. అధికారం మారిపోయింది. జగన్ ఓడిపోయారు. చంద్రబాబు అధికారంలో ఉన్నారు. మొదటి రోజుల్లో చంద్రబాబు చాలా చెప్పారు. అధికారులకు వేధింపులు ఉండవన్నారు. అలాగే సమయపాలన ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు ఆయన తీరులో మార్పు రాలేదనే మాట బాగా వినిపిస్తోంది.

ప్రస్తుతం సచివాలయం ఉద్యోగుల్లో, ఐఏఎస్ అధికారుల్లో ఒకటే అంశంపై చర్చ జరుగుతోంది. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన పాలనలో ఎలా జరిగిందో.. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అయితే.. నాటి కంటే.. ప్రస్తుత పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక, మళ్లీ గతంలో ఆయన పాలనలో ఏం జరిగిందో.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అధికారులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే పనిచేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబులో ఆ మార్పు కేవలం పది రోజులు మాత్రమే కనిపించింది.

తాజాగా ఏం జరుగుతుందంటే.. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎంతో సమావేశం, మీరు తప్పక రావాల్సిందే అని ఐఏఎస్ అధికారులకు ఒక రోజు ముందే సీఎంఓ అధికారులు సమాచారం ఇస్తారు. నాలుగు గంటలకు జరగాల్సిన సమావేశం, రాత్రి ఏడు గంటలకు కూడా ప్రారంభం కాదు. రాత్రి ఏడు గంటలకు ముగించాల్సిన సమావేశం.. రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది. అది రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగుతుంది. వెయిటింగ్‌కు మూడు గంటలు.. సమావేశానికి మరో మరో మూడు గంటలు.. మొత్తం ఆరు గంటలు.. సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారుల ఓపికకు ఇదో పరీక్ష.

అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మూటలుగా మారాయి. రోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటలకే అన్నీ ముగిస్తాను అని చెప్పిన చంద్రబాబు పది రోజుల తరవాత షరా మాములే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి తొమ్మిది గంటల వరకు.. కొన్నిసార్లు రాత్రి పది లేదా 11 గంటల వరకు కూడా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో ఐఏఎస్ అధికారులు ఐదేళ్లు ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా పని చేశారంట. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపారంట. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మళ్లీ పాత పద్ధతులే పాటిస్థూ నరకం చూపిస్తున్నారని కొందరు ఐఏఎస్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మారతారని అనుకున్నాం. కానీ.. మేమే మార్చుకోవాల్సి వచ్చిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎంఓ అధికారులకు కూడా ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పెద్ద సారు వద్దకు చేరుతుందా.. లేదా.. వేచి చూడాల్సి ఉంది.

leave a reply