వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణాలేమిటో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నమ్ముకున్నది ఫేక్ ప్రచారాన్ని మాత్రమే. ఈ విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. వై నాట్ 175 అని గొప్పగా ప్రకటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఏపీ ఓటర్లు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా చేయని పనులను కూడా చేసినట్లు.. జరగని పనులు కూడా జరిగినట్లు ఫేక్ ప్రచారం చేసుకుంది. అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం.. సోషల్ మీడియా కారణంగా ప్రతి విషయం ఇట్టే తెలిసిపోతుంది. నిజానిజాలు కూడా వెంటనే తెలిసిపోతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అందరికీ గుర్తే. అమ్మఒడి పేరుతో ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ప్రతి తల్లి అకౌంట్‌లో డబ్బులు వేస్తామన్నారు. మొదటి ఏడాది 15 వేలు ఇచ్చారు. ఆ తర్వాత 14 వేశారు. ఆ తర్వాత 2 వేలు బడి మెయింటనెన్స్ అంటూ కట్ చేసి 13 వేలు మాత్రమే ఇచ్చారు. అది కూడా ఐదేళ్లు అధికారంలో ఉంటే.. నాలుగు సార్లే ఇచ్చారు. 2020, 2021 ఏడాదుల్లో మాత్రం జనవరి 10న ఇచ్చారు. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ఒక్కో నెల పొడిగించారు. చివరికి 2023లో ఏకంగా అక్టోబర్ నెలాఖరు వరకు విడతల వారీగా చెల్లించారు. ఇక చివరి ఏడాది 2024లో అయితే ఎన్నికల సాకుతో చెల్లించలేదు.
ఇక 2024లో వైసీపీ ఓడిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి డబ్బులిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయినా సరే.. తొలి ఏడాది మొత్తం డబ్బులు ఇవ్వటం లేదు.. అన్ని మోసపు హామీలే అంటూ తెగ ప్రచారం చేశారు వైసీపీ నేతలు. చివరికి మంత్రి నిమ్మల రామానాయుడుని ఇమిటేట్ చేస్తూ.. చంద్రబాబు సర్కార్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు జగన్. అయితే ఇవ్వటం లేదనే ప్రశ్నకు శాసనసభ, మండలిలోనే మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అలాగే డేట్ కూడా ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే అందరి అకౌంట్‌లో డబ్బులు పడతాయన్నారు. అన్నట్లుగానే గతేడాది జూన్ 12న ప్రతి తల్లి ఖాతాలో.. ఎంతమంది పిల్లలుంటే.. అంతమందికి చెందిన తల్లికి వందనం డబ్బులు వచ్చాయి.
రెండో ఏడాది తల్లికి వందనంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తల్లికి వందనం జాబితా విడుదల చేసింది. అలాగే అర్హులైన వారు జాబితాలో పేరు లేకపోతే.. వెంటనే ఆయా పంచాయతీల కార్యాలయాల నుంచి ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు కూడా. బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రభుత్వ సిబ్బందే స్వయంగా పూర్తి చేస్తుంది. అయినా సరే.. వైసీపీ నేతలు, జగన్ సొంత సంస్థ సాక్షి మీడియా మాత్రం తల్లికి వందనం కు పంగనామాలు అంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు.
జూన్ 12న తల్లికి వందనం లేనట్టే అని.. రెండో ఏడాదే చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెరుచుకొనున్న ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలు.. స్కూల్ తెరిచేనాటికి ప్రతి ఏటా తల్లికి వందనం అమలు చేస్తామని గతంలో ప్రకటించారన్నారు. మరో అడుగు ముందుకు వేసి.. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి చంద్రబాబు ప్రభుత్వం 17 వేలు ఎగనామం పెట్టిందంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది తల్లికి వందనం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదంటున్నారు వైసీపీ నేతలు. అలాగే ఎప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారో ప్రభుత్వం ప్రకటించ లేదని.. తల్లికి వందనం పథకంలో గత ఏడాది 20 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టారని.. 260 కోట్లు ఇప్పటికి బకాయిలు చెల్లించ లేదంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాగే
ఈ ఏడాది లబ్ధిదారులు ఎంత మందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదంటున్నారు.
నిజానికి వైసీపీ నేతలు, సాక్షి మీడియా ఫేక్ ప్రచారం చేస్తోందని టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం జూన్ 19న ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే అర్హులెవరో తెలుసుకునే జాబితా ఇప్పటికే సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని.. గతేడాది ఏ ఒక్క విద్యార్థికి కోత పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. అమ్మ ఒడిని ఒక కుటుంబంలో ఒక్కరికే ఇచ్చింది వైసీపీ సర్కార్ అని.. కానీ కూటమి ప్రభుత్వంలో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే.. అంత మందికీ ఇచ్చామన్నారు. ఇప్పటికైనా ఫేక్ ప్రచారం మానుకోకపోతే.. రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేస్తున్నారు.
