వైసీపీ నేతల్లో ఇప్పుడంతా ఒకటే మాట.. అన్న ఆదేశాలు మాత్రమే ఇస్తారా.. ఆయన ఆచరించరా..? అవును.. వైసీపీలో ఉన్న కిందిస్థాయి కార్యకర్త మొదలు.. టాప్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరిలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఇందుకు వాళ్లు చాలా కారణాలు చూపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఓడిన తర్వాత కూడా జగన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి 2019 ఎన్నికల ముందు ఉన్న జగన్ వేరు.. ఆ తర్వాత జగన్ వేరు.. అంటున్నారు సన్నిహితులు. పాదయాత్ర సమయంలో జగన్ వ్యవహరించిన తీరు.. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నుంచి జగన్ వ్యవహరిస్తున్న తీరును ఇందుకు ఉదాహరిస్తున్నారు.
2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో జగన్ వ్యవహార శైలికి సామాన్యులు, మహిళలు, వృద్ధులు ఆశ్చర్యపోయారు. మీ బిడ్డ అంటూ జగన్ చెప్పిన మాటలకు పడిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడిగిన వెంటనే.. సరే ఇద్దాం అన్నట్లుగా.. ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత అసలు జగన్ అంటే ఎలా ఉంటారో జనాలకు అర్థమైంది. ప్యాలెస్‌లోఉన్న రాజు గారి మాదిరిగా జగన్ దర్శనం కరువైంది. సామాన్య ప్రజలకే కాదు.. చివరికి పార్టీలో మంత్రి స్థాయి లీడర్లను కూడా జగన్ దగ్గరకు రానివ్వలేదు. చివరికి ప్రారంభోత్సవాలు, నిధుల విడుదల కూడా అంతా బటన్ నొక్కుడు ద్వారా ఆన్ లైన్‌లోనే నిర్వహించారు.
ప్రజలతో ఉండాలంటూ సొంత పార్టీ కార్యకర్తలకు పదే పదే చెప్పారు తప్ప.. ఆయన మాత్రం.. కంచెలు, పరదాల మధ్యలో పర్యటించారు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. ముఖ్యమంత్రి నుంచి ఓ సాధారణ ఎమ్మెల్యే స్థాయికి జగన్ దిగిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో.. జగన్ ఇప్పటికైనా మారతారని అని సొంత పార్టీ నేతలు భావించారు. కానీ.. రెండేళ్లు దాటినా కూడా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే నియంత పోకడ.. అదే మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా పరామర్శలకు తప్ప.. బయటకు రాలేదు. ప్యాలెస్ సమావేశాలు తప్ప.. పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిందే లేదు. చివరికి పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో కూడా జగన్ పాల్గొనడం లేదు.
నిరసన అయినా, ఆందోళన అయినా, సంఘీభావం అయినా.. మరేదైనా సరే.. నిర్వహిస్తాం.. అంటూ మీడియా ముందు గొప్పగా చెబుతున్నారు తప్ప.. ఆయన మాత్రం అందులో పాల్గొన్న దాఖలాలు లేవు. పుల్వామా దాడిలో మృతులకు నివాళి అర్పించడానికి క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అందులో జగన్ లేరు. తాజాగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వీటిల్లో కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. కేసులు పెట్టించుకున్నారు తప్ప.. జగన్ మాత్రం.. కనీసం సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టలేదు. డీఎస్సీలో అక్రమాలంటూ నేతలంతా రోడెక్కితే.. జగన్ మాత్రం.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఏసీ హాల్‌లో ఆ నలుగురి మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. దీంతో జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అన్న ఆర్డర్ వేస్తాడంతే తప్ప.. ఆయన ఆచరించేది లేదన్న మాట.. అంటున్నారు సొంత పార్టీ నేతలు.
