జయహో భారత్‌.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ గ్రాండ్ సక్సెస్!

Share this :

చంద్రుడిని ముద్దాడిన విక్రమ్ ల్యాండర్.. దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్ తన పేరు నమోదు చేసుకుంది. ఇస్రో ఘన చరిత్ర సృష్టించింది. ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. షెడ్యూల్ ప్రకారం నిర్ణయించుకున్న సమయానికి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో 140 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకుంటున్నారు… ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు మోపిన తొలి దేశంగా భారత్ ఘనత సాధించింది. జాబిల్లిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అద్భుత విజయం తన ఖాతాలో వేసుకుంది. జులై 15వ తేదీన చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఏపీలోని శ్రీహారి కోట నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన ప్రయానాన్ని కొనసాగిస్తూ ఎల్‌వీఎం3-ఎం4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది.

సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని ముద్దాడింది. ప్రధాని నరేంద్ర మోదీ జోహన్నెస్‌బర్గ్ నుండి వర్చువల్‌గా చంద్రయాన్-3 ప్రయోగాన్ని విక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే భారత శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇక చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ అక్కడి వాతావరణం, పరిమాణంపై పరిశోదన జరపనుంది.