Ghost Dreams: రాత్రిళ్లు దెయ్యం కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

ఈ సంకేతలు మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తాయి! నిర్లక్ష్యం చేశారంటే..

Share this :

మన నిద్రలో కలలు ఒక భాగం. ప్రతి ఒక్కరికీ కలలు వస్తాయి. అవి మంచివో.. చెడ్డవో.. అయి ఉండవచ్చు. కానీ.. కొన్ని గుర్తుంటాయి.. మరి కొన్ని గుర్తుండవు. కొన్ని కలలు తీవ్రంగా భయపెడతాయి. మరికొన్ని ఆనందింప చేస్తాయి. ఒక్కోసారి కలలో కూడా ఊహించని కలలు కూడా వస్తాయి. నిజానికి కలలు అనేవి మనకు సాధ్యం కాని కోరికలు, ఆలోచనలు, భావోధ్వేగాలను వ్యక్తం చేయలేక లోలోపల అణచేయడం (ఇన్హిబిషన్స్‌) వల్ల స్వప్నావస్థలో అవి బయటకు వస్తాయని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కలలో దెయ్యాలను పోలిన వింత ఆకారాలు కనిపించి కలవరపెడతాయి. అలా మీకెప్పుడైనా జరిగిందా? అసలు కలలో దెయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? పదేపదే ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? అసలిది దేనికి సంకేతం? అనే సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? రండి.. కలల ప్రపంచంలోకి ప్రవేశిచి దాని లోతుపాతులను అన్వేషిద్దాం..

మానసిక నిపుణుల ప్రకారం.. కలలు వ్యక్తిగతమైనవి. వాటి అర్థం వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారుతుంటాయి. అయినప్పటికీ కలలలో తరచూ దెయ్యాల వంటి వింత ఆకారాలు కనిపించడానికి కొన్ని సంకేతాలు, థీమ్‌లు ఉన్నాయి. అవేంటంటే..

పరిష్కారం దొరకని సమస్యలు

కలలలో కనిపించే దయ్యాలు శక్తివంతమైన చిహ్నాలకు గుర్తులు. అవి మన అంతర్గత, బహిర్గత ప్రపంచానికి సంబంధించి వివిధ అంశాలను సూచిస్తాయి. ఏదైనా పరిష్కారం దొరకని సమస్యలు, అసంపూర్తిగా వదిలేసిన పనుల తాలూకు చిహ్నాలు. అంటే వ్యక్తిగత సంబంధాలు, సంఘటనలు మనసులో వేధిస్తుంటే.. వాటిని మర్చిపోలేక మదన పడుతుంటే ఇలా కలలో దెయ్యాల రూపంలో కనిపిస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు.

మనసులోని భయం, ఆందోళన

దెయ్యం కలలు.. మనసులోని పలు రకాల భయాలు, ఆందోళనకు ప్రతీకగా కూడా ఉంటాయి. మీ ఆలోచనలను వెంటాడుతున్న అంతర్లీన భయాలు, ఆందోళనలతో మీరు చేస్తున్న పోరాటాన్ని సూచిస్తుంది. దెయ్యం కలలు రావడానికి ఇది కూడా ఓ కారణమేనట.

గతంలోని జ్ఞాపకాలు వెంటాడితే..

కొన్ని సందర్భాల్లో కలలో వచ్చే దెయ్యం మీ గతానికి సంబంధించిన కొన్ని సంఘటనలను సూచిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి మరణించినట్లైతే వారితో మాట్లాడటానికి మీరు చేసే ప్రయత్నం లేదా వారితో మీకున్న జ్ఞాపకాలు, అనుభవాల తాలూకు సంఘటనలను ప్రతిబింబిస్తుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన మార్పు లేదా పరివర్తన చెందుతున్నట్లయితే దానికి సంకేతం కూడా ఈ విధమైన కలలు వస్తాయి.

కలలో భావోద్వేగాలు

కలలో దెయ్యాన్ని చూసినప్పుడు మీరు భయపడ్డారా? లేదా ప్రశాంతంగా ఉన్నారా లేదా ఏ భావం లేకుండా క్యాజువల్‌గా ఉన్నారా?.. అనే మీ భావోద్వేగ ప్రతిస్పందన మీద కూడా దాని సంకేతం ఆధారపడి ఉంటుంది. అలాగే కలలో దెయ్యాన్ని చూసినప్పుడు ఆ సమయంలో కలలో ఏ ప్రదేశంలో ఉన్నారు? కలకు ముందు ఆ తర్వాత ఏం జరిగింది వంటి వివరాలు కూడా విలువైన ఆధారాలను అందిస్తాయి. అలాగే కలల అర్థాలపై మీకున్న నమ్మకాలు, సామాజిక నేపథ్యం, మీ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను విశ్లేషించిన తర్వాత వాటి వెనుక ఉన్న అసలు వాస్తవం తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.

అసలు దెయ్యం కలలు ఎందుకు వస్తాయంటే..

దెయ్యాలు నిజంగానే ఇలలో ఉన్నాయా? లేవా అనే విషయం శాస్త్రీయంగా ఇప్పటి వరకూ ఎవరూ నిర్ధారించలేదు. దెయ్యాల సంగతి పక్కనబెడితే కలలు ఎందుకు వస్తాయనే విషయాన్ని ఇప్పటికీ సైంటిస్టులకు, సైకాలజిస్టులకు అంతుచిక్కని భేతాళ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక వాటి అర్థాలు ముందే చెప్పినట్లు మనిషికీ.. మనిషీకి మారుతూ ఉంటాయి.

ఇప్పుడు అర్థమైందా..

పరిష్కరించని లేదా పరిష్కారం దొరకని సమస్యల నుంచి గతం తాలూకు భయాల వరకు పలు కారణాల వల్ల కలలో దెయ్యాలు కనిపిస్తుంటాయి. కాబట్టి.. ఇకపై మీ కెప్పుడైనా కలలో దెయ్యాలు కనిపిస్తే.. ఒకసారి మీ మనసులో దాచుకొన్న భయాలేమిటో.. ఆ సమస్యలేమిటో.. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీ మనసు చెప్పే ఊసులను మనసు పెట్టి వినండి. అన్ని సమస్యలు అవే తీరిపోతాయ్‌