అధికార గర్వంతో మహిళా అని చూడకుండా అకృత్యాలకు పాల్పడిన వినుకొండ సీఐ చిన్న మల్లయ్య ఉదంతంపై స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఉక్కుపాదం మోపారు. బాధితురాలికి అండగా నిలవడమే కాకుండా, తప్పు చేసిన అధికారిపై తక్షణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. వినుకొండ సీఐ చిన్న మల్లయ్య ఆగడాలకు బలైన బాధిత మహిళ గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పందించారు.
స్వయంగా బాధితురాలిని కలిసి, ఆమెకు జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. “నువ్వు ఒంటరి దానివి కావు.. నీ వెనుక ఈ ప్రభుత్వం ఉంది” అని భరోసానిచ్చి, ఆమెలో ధైర్యాన్ని నింపారు. ఒక రక్షక భటుడే భక్షకుడిగా మారడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి, ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా, నిందితుడైన సీఐ చిన్న మల్లయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేసేలా ఒత్తిడి తీసుకువచ్చారు.
ఫలితంగా ప్రభుత్వం సీఐపై సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసు వ్యవస్థలో ఉంటూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే వారికి ఈ చర్య ఒక హెచ్చరిక అని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడదని పునరుద్ఘాటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు. బాధిత మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
