“ఒక కుటుంబం… ఒకే టికెట్..”

అధ్యక్షా ఇది కొందరికా? అందరికీనా??..

Share this :

“ఒక కుటుంబం… ఒకే టికెట్..”
నేటి ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పాలసీ… అధ్యక్షా ఇది కొందరికా? అందరికా??..

నేను మోనార్క్ ని… నన్నెవరూ మోసం చేయలేరు… ఇక్కడ నేను చేసేదే శాసనం… నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు… ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితి… అధినాయకుడు చంద్రబాబు తీసుకొచ్చిన ఒక కుటుంబం ఒకే టికెట్ పాలసీ అందరికా? కొందరికేనా?? అన్న అనుమానాలు… పార్టీలో వినిపిస్తున్న భిన్న స్వరాలపై కథనం…

ఆంధ్ర ప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు పెంచాయి. పోటీ అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో అభ్యర్థుల పై సర్వేలు చేస్తున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు టికెట్ ఆశిస్తుస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న పాలసీ తీసుకొచ్చింది.

అధిష్టానం తీసుకొచ్చిన ఈ విధానం పార్టీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్న ప్రశ్నలు కార్యకర్తల మెదళ్ల ను తొలచేస్తున్నాయి.

ఈ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ కుటుంబాల్లో టికెట్ గుబులు పట్టుకుంది… పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కో కుటుంబానికి రెండు, మూడు టికెట్లు కేటాయించింది. ఓడిపోతామని తెలిసినా వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు పోగొట్టుకుని ప్రజల్లో ఉంటూ వచ్చారు. టీడీపీ అధిష్టానం 2024 సాధారణ ఎన్నికల నాటికి “ఒక కుటుంబం-ఒకే టికెట్” పాలసీ తీసుకొచ్చింది. దీంతో చాలా మంది నేతలు అధిష్టానం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటిలో టీడీపీ ఇంఛార్జి రమేష్ రెడ్డి గత 25 ఏళ్లుగా పార్టీ కి సేవ చేస్తూ.. ఓడిపోతామని తెలిసినా కోట్లు ఖర్చు పెట్టుకుని తాను, తన సోదరుడు శ్రీనివాస రెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలీదా అని ప్రశ్నించినట్లు సమాచారం. రమేష్ రెడ్డి ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఆయన వర్గీయులు సైతం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇది ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థి గెలుపుకు ఎంత వరకు సహకరిస్తుందో పార్టీ పెద్దలు ఆలోచించాలి. అటు అనంతపురం జిల్లాలోనూ రాప్తాడు, ధర్మవరం లలో పరిటాల కుటుంబం గత ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఒకే టికెట్ అంటుండటంతో పరిటాల కుటుంబంతో పాటు అభిమానులు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి ఇరువురు పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ కుటుంబాలు చంద్రబాబు తీసుకొచ్చిన పాలసీ తో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి.

నాణేనికి ఒక వైపు ఇలా ఉంటే రెండో వైపు మాత్రం చంద్రబాబు పాలసీ కి ఆయనే తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి, వియ్యంకుడు బాలకృష్ణ హిందూపురం నుంచి, వైజాగ్ నుంచి బాలయ్య చిన్న అల్లుడు పోటీలో ఉండబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం మీడియాలో జోరుగా సాగింది.

అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుని కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, ఆయన సోదరి ఆదిరెడ్డి భవాని లు మరో మారు పోటీ లో ఉండబోతున్నరన్న వార్తలకు ఎవరు సమాధానం చెప్పాలి. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కుటుంబాలు ఇలా ఉన్నాయో అన్న సందేహాలు పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థి గెలుస్తాడన్న అవకాశం ఉన్న చోట రెండు టికెట్లను కేటాయించాలి. అభ్యర్థి గెలుపుకు అధిష్టానం సహకరించాలి. అభ్యర్థి గెలుపుకు స్థానికంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పోటీ అధికంగా ఉంటే ఎవరికి ప్రజాబలం ఉందో వారికి టికెట్ కేటాయించి మిగిలిన వారికి న్యాయం చేస్తూ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత పార్టీ పెద్దలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది…

ప్రస్తుత పరిస్థతి మాత్రం బంతిలో ఎక్కడ కూర్చొన్న వడ్డించే వాడు మనోడైతే అన్న చందంగా పార్టీలో పరిస్థితులు తయారైతే సామాన్య నాయకుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

“ఒక కుటుంబం ఒకే టికెట్” అన్న నినాదాన్ని తీసుకొచ్చిన అధినేత చంద్రబాబు తన కుటుంబంలో సైతం పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా లేక పక్క వాళ్ళను బలి చేస్తారా అన్నది చూడాల్సి ఉందని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేచి చూస్తున్నారు.

సముద్రవాణి