ఘనంగా సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ వర్ధంతి!

Share this :

ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో దూసుకు పోతుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. దూరదర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వార్తలు, వినోదం, విజ్ఞానం అన్నీ ఈ ఛానల్ ద్వారా తిలకించేవారు వీక్షకులు. 1982 లో దూరదర్శన్ ఒక దేశీయ ప్రసారిగా ఉనికిలోకి వచ్చింది. భారతదేశంలో దూరదర్శన్ అతి పెద్ద ప్రసార సంస్థల్లో ఒకటి. ఆ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో సిటీ కేబుల్ ఒక ప్రభంజనం సృష్టించింది. మొదటి సారిగా సిటీ కేబుల్ వ్యవస్థను ప్రారంభించి కోట్ల మందికి వినోదం.. ఎంతోమందికి ఉపాధి కల్పించారు పొట్లూరి రామకృష్ణ. తర్వాత కాలంలో ప్రైవేట్ ఛానల్స్ ఊపందుకున్నాయి.

తెలుగు రాష్ట్ర ప్రజలకు సిటీకేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. విజయవాడలో సిటీ కేబుల్ ప్రారంభించిన పొట్లూరి రామకృష్ణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఒక ట్రెండ్ సృష్టించారు. నగరాలు, గ్రామాల్లో సైతం సిటీ కేబుల్ ని విస్తరించారు. దీంతో ఎంతోమంది ఉపాధి పొందారు. ప్రైవేట్ ఛానల్స్ పెద్దగా ప్రచారంలోకి రాకముందు వినోదం, వార్తలు సిటీ కేబుల్ ద్వారా అందించి అందరి మన్ననలు పొందారు పొట్లూరి రామకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సిటీ కేబుల్ కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. నేడు ఇన్ని ఛానళ్ళు రావడానికి పొట్లూరి రామకృష్ణే కారణం అని అంటుంటారు.

దేశంలో ఎన్నో నెట్ వర్క్ లు ఉన్నప్పటికీ సిటీ కేబుల్ ప్రథమ స్థానంలో ఉందంటే అతిశయోక్తి లేదు. అయితే సిటీ కేబుల్ వ్యవస్థ అభివృద్దికి కేబుల్ అపరేటర్లు, ప్రేక్షకులే కారణం అని ఎన్నో సార్లు గుర్తు చేసుకునేవారు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ. తాను స్థాపించిన సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశం పొందడం గర్వకారణంగా ఉందని గుర్తుచేసేవారు. ఆయన చనిపోయినా.. ఎంతోమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేడు ఆయన 25వ వర్థంతి సందర్భంగా విజయవాడ సుబ్రమణ్యం (బాబీ), మిత్ర బృందం పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.