(మస్తాన్. గగ్గుటూరి. రాయచోటి,అన్నమయ్య జిల్లా)
అమ్మా… అమ్మా… నన్నెందుకు కన్నావ్, నన్ను ఎందుకు చంపేశావమ్మా ? ప్రాణం తీస్తుంటే నీకు పాపం అనిపించలేదామ్మా ?
నీ కడుపులో ఉన్నన్ని రోజులు నేను చాలా భద్రంగా, క్షేమంగా, సంబరంగా ఉన్నానమ్మా ? నిజంగా నీ మీద ఒట్టమ్మా !!
తొమ్మిది నెలలు గుడి లాంటి నీ గర్భంలో మోసి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తివి కదమ్మా ?
పురిటి నొప్పులతో నీ ప్రాణం పోతున్నా నన్ను ఈ లోకంలోకి
తెస్తివి కదమ్మా ?
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
ఈ భూమ్మీద పడగానే నీ చిరునవ్వు చూడాలని ఎంతగా ఆశించానమ్మా ?
నీ నవ్వు, ఆనందభాష్పాలు, నీ స్పర్శ ఏమీ తెలీకుండానే చంపేశావు కదమ్మా ? నీ కడుపున పుట్టడం నా తప్పా అమ్మా ?
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
ఈ లోకంలోకి పడగానే నిన్ను చూసి మురిసి పోవాలని వేయి కళ్ళతో ఎదురు చూశా ?? నిజం అమ్మా… నీ పాదాల మీద ఒట్టు !!
కానీ ఏంటమ్మా ఇదీ… నీ పొత్తిల్ల నుంచి నన్ను ప్రేమగా నీ చేతుల్లోకి తీసుకోకుండానే నా ఊపిరి తీస్తివి ఎందుకమ్మా ???
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
నీ కడుపున పడి తప్పు నేను చేశానా లేక నా శ్వాస నిలిపి నువ్వు తప్పు చేశావా అమ్మా ?? నిజం చెప్పుమ్మా ??
బొడ్డు కూడా కోయకుండా నన్ను మురికి కాలువకు బలిచ్చావు కదమ్మా ??? నీకు కొంచెమైనా బాధ లేదా అమ్మా !!!
నిన్ను చూడకుండానే నా ఊపిరి పాయనే అని నాకు
భలే ఏడుపొచ్చిందమ్మా !!
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
నన్ను కని నువ్వు తప్పు చేశావా ? నేను నీ కడుపున పడతానని నాకు తెలుసా? నీ కడుపులో పడటం నా తప్పా అమ్మా ???
తొమ్మిది నెలలు తిండి పెట్టి ప్రాణం పోసి నాకు శరీరాన్నిస్తివి …
మరి పొట్ట నుంచి దిగగానే ఎందుకమ్మా నా ఊపిరి ఆపితివి… నా తల్లి నా శ్వాస ఆపుతుందని నేను ఎరగనా అమ్మా ??
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
నా బిడ్డ నా బిడ్డ అని ఎన్ని కలలు కని ఉంటావమ్మా..! నన్ను చంపి అవన్నీ ఒమ్ము చేస్తివి కదమ్మా ?
నా భవిష్యత్తుకు గురువులా దారి చూపాల్సిన నువ్వు ప్రాణమే లేకుండా చేశావు కదమ్మా ?
లోకంలో పిల్లలు లేని తల్లిదండ్రులకు నన్ను దానం చేయొచ్చు కదమ్మా ?
కంటికి రెప్పలా నన్ను పెంచి పోషించి విద్యా బుద్దులు నేర్పి ఉన్నతికి తీసుకెళ్ళే వారు కదమ్మా ?
ఏదో నాడు నన్ను చూసి అవకాశం నీకుండు కదమ్మా ?
ఇన్నీ ఆలోచించకుండా ఏం పని చేశావమ్మా ?
మరి నన్నెందుకు చంపేశావమ్మా ? నేనేం తప్పు చేశానమ్మా ?
( ప్రొద్దుటూరులోని వాజ్ పాయ్ నగర్ లో జరిగిన నిజ సంఘటన )
