(కోలా లక్ష్మీపతి/ఎడిటర్, మాయావి న్యూస్):
వందల కోట్లతో రోడ్లు వేయడాలు… భక్తుల సొమ్ముతో అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు… ఏళ్ల తరబడి ముందు నుంచే రాజకీయ ప్రయోజనంతో ముందడుగులు… ఇలా ఎన్ని విధాలుగా ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నించినప్పటికీ… అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు అక్రమ కేసులతో ప్రతిపక్షాలను నోరు తెరవనివ్వకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పరిపాలన సాగించాలని ప్రయత్నించిన వైసీపీకి తిరుపతి ప్రజలు ఐక్యమై ఇక మీ పాలన వద్దంటూ చారిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. స్వపక్షం కూడా ఊహించలేని విధంగా భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎన్నికలకు ముందు చూస్తే అభ్యర్థిత్వంపై సందేహం.. నాయకుల్లో లోపించిన ఐక్యత ఎన్నో లోటుపాట్లతో గెలుపు పై సందేహం వెలిబుచ్చిన సందర్భంలో… నాయకుల్లో అప్పుడు ఐక్యత లేకపోయినా ప్రజలు మాత్రం ఐక్యంగా ఓట్లు వేసి గెలిపించారు. అయితే ఇప్పుడు ప్రజలు చూపించిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాయకులు అందిపుచ్చుకోలేక ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఐక్యత లేకుండా ముందుకు సాగుతుండడం ప్రజల్లో ఒక విధమైన అయోమయం పరిస్థితికి దారితీస్తోంది.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సరిగా నెలరోజులు కూడా కాకమునుపే తిరుపతిలో నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇప్పటివరకు అన్ని పార్టీలను కలుపుకొని కనీసం ఒక ప్రోటోకాల్ లిస్ట్ కూడా తయారు చేయకుండా, వారిని తనతో పాటు కార్యక్రమాలకు ఆహ్వానించకుండా, తన ధోరణిలో తాను వెళుతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి వద్దకు సాధారణంగా నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులు కూడా బదిలీల కోసం ఆయన సిఫార్సు లేఖల కోసం ఉద్యోగులు వస్తుంటారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగికి బదిలీ కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సిఫార్సు లేక ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన వద్దకు చేరుతున్న వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, వారికి పదవుల కోసం సిఫార్సులు చేయడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది.
ఎన్నికల నెల రోజులకు ముందు వరకు తిరుపతి నగరంలో అనేక ఉద్యమాలు చేస్తూ నిరసనలు చేస్తూ ప్రజల్లో నిరంతరం మెలుగుతూ కేసులు పెట్టించుకుని అనేక ఇబ్బందులు పడిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కనీసం తమకు దక్కాల్సిన నామినేటెడ్ పోస్టులు సిఫార్సు కోసం ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం పట్ల ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు నగర కమిటీ నాయకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా పోరాటాలు చేపట్టారు. తుడా చైర్మన్ , లేదా టీటీడీ పాలక మండలి సభ్యుల పదవిని ఆశిస్తున్న తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అయితే ఒక అడుగు ముందుకేసి, తిరుమల కొండపై మఠాల వ్యవహారం, అప్పటి ఈవో ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజాల అక్రమాలపై వీర మహిళా నాయకురాలు ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి నిరసనలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ పోరాటాలలో ఎక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కి సంబంధం లేకుండా కార్యక్రమాలను చేపడుతుండడం చర్చనీయాంసమైంది. మరో వర్గం అయిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కీర్తన, తదితరులు కార్యక్రమాలు చేపట్టకపోయినా పార్టీలో తమకున్న పరపతిని ఉపయోగించుకుని పదవుల కోసం సిఫార్సులు చేయించుకుంటున్నారు.
మరోవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం అధినేత దృష్టిలో పడడం కోసం ప్రజా సమస్యలను పట్టించుకునేలా నిరంతరం కార్యక్రమాలను చేపడుతూ మరోవైపు పైరవీలు చేయించుకుంటూ ఎలాగైనా పదవులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలోనే ఏడు గ్రూపులుగా తయారవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకరిద్దరు నాయకులు తిరుమల కొండపై తట్టలు పెట్టించడం, టీటీడీలో రెవెన్యూ పంచాయతీలో సిఫార్సులు చేయడం, ఒకరు చంద్రబాబు వద్ద మరొకరు నారా లోకేష్ వద్ద తమకు మంచి పలుకుబడి ఉందని అధికారుల వద్ద ప్రగల్భాలు పలుకుతూ తమ సొంత పనులను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. తిరుపతిలో ఏకైక కార్పొరేటర్ ఒకరు తనకు గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి దక్కాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇక ఇంతకాలం ఓటు బ్యాంకు లేకపోయినా కేంద్రం లో అధికారంలో ఉన్న నైతిక ధైర్యంతో టిటిడి పై తిరుపతి పరిపాలనపై విమర్శలు చేస్తూ కోర్టులలో కేసులు వేస్తూ ఒక రకమైన ప్రజా ఉద్యమాన్ని నడిపిన బిజెపి నాయకులైన భాను ప్రకాష్ రెడ్డి సామంచి శ్రీనివాస్ తదితర నాయకులు ఎన్డీఏ కూటమి నిబంధనలను అనుసరించి తమకు కూడా నామినేటెడ్ పదవులు దక్కాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
పనిలో పనిగా ఇంతకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు బిజెపిలో చేరిన నవీన్ కుమార్ రెడ్డి కూడా టిటిడి పై విరుచుకుపడుతూ తనదైన శైలిలో అధిష్టానం దృష్టికి వెళుతూ పదవి కోసం పరోక్షంగా పైరవీలు చేపట్టారు.
అంతా బాగానే ఉన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎంతో ఐక్యంగా నిలబడి ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎన్డీఏ కూటమి నాయకులు ఇలా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉంటే ఆరంభంలోనే ప్రజల్లో విసుగు ఏర్పడితే భవిష్యత్తులో పరిస్థితి ఏమిటనేది ఊహించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. తమ తప్పులు తాము తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచిస్తున్న మేరకు పారదర్శకంగా గర్వం తలకి ఎక్కించుకోకుండా వ్యవహరిస్తే ప్రజల్లో 10 కాలాలపాటు నిలువ గలరు.
