తెదేపా అనుభవం, జనసేన యువరక్తం కలిస్తే అద్భుత పాలన: ఎంపీ రఘురామకృష్ణం రాజు

Share this :

ఏపీలో గత కొన్నిరోజలుగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ క్రమంలో ఏపీ స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్లబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ, జనసేన పొత్తుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత కొంత కాలంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ పై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడన బహిరంగ సభలో చెప్పిన రూపాయ పావలా కథ మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

ఆడపడుచులకు 30 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తరువాత మీరే కట్టుకోండి అని అన్నారు. కట్టుకోకపోతే ఇచ్చిన సైట్ లాగేసుకుంటామని చెప్పారు. 30 లక్షల ఇండ్లు కాదు కదా మూడు వేల ఇండ్లు కూడా రాష్ట్రంలో నిర్మించలేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు.. గత ఆరు నెలల క్రితం పార్లమెంటులోనే ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కేవలం 2000 ఇండ్లు మాత్రమేనని ప్రకటించడం జరిగింది. రాజమండ్రిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో స్థానిక నాయకులు 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇకనైనా ప్రజలు గమనించాలని.. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కి గట్టిగా బుద్ది చెప్పాలని అన్నారు. టీడీపీ, జనసేన పొత్తు పై ఇప్పుడు రాష్ట్రంలో చర్చలు నడుస్తున్నాయని.. తెదేపా అనుభవం, జనసేన యువరక్తం కలిస్తే అద్భుత పరిపాలన వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.