Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?

నేడు సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై ఉత్కంఠ.. ఏం జరగనుంది..

TDP Leader Chandrababu Naidu TDP Leader Chandrababu Naidu
Share this :

అమరావతి, అక్టోబర్‌ 3: ఎవరూ ఊహించని వ్యక్తులు అరెస్ట్ (Chandrababu Naidu Arrest) అవుతారు.. మరెవరూ ఊహించని సెక్షన్లు తెరపైకి వస్తాయి. అప్పుడెప్పుడో ఆగిపోయింది అనుకున్న కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. గోటితో పోయేది గొడ్డలి దాకా వెళుతుంది.. ఇన్ని జరుగుతున్నా ఏపీలో రాజకీయ (AP Politics) నాయకుల వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. జంకు బొంకు, భయం బిడియం లాంటి పదాలు చాలా దూరం వారికి. యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయి. పట్టించుకునే వారుండరు.. ప్రశ్నించేవారు అసలే ఉండరు. ఎవరిని చూసుకునో ఆ ధైర్యం. ఆంధ్రప్రదేశ్‌తో అరాచకం రాజ్యమేలుతున్నా.. బాధ్యత గల పెద్దలు ఎవరు కేంద్రం నుంచి స్పందించరు ఎందుకు? ప్రస్తుతం ఇదే సర్వత్ర చర్చణీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఇదెక్కడి చోద్యం అంటూ జగన్‌ సర్కార్‌పై (CM Jagan) ఘాటు విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ రాజకీయాల్లో ఆయన పేరుని పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ చట్టపరంగా అనుసరించాల్సిన పద్ధతుల్ని అనుసరించకుండా ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెడితే కనీసం ఆరా తీసే తీరిక కూడా కేంద్రంలోని పెద్దలకి కుదరలేదంటున్నారు సీనియర్‌ రాయజకీ వేత్తలు. పది రోజుల క్రిందిట ఢిల్లీ వెళ్లి ఎన్టీఆర్ వెండి నాణెం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు కేంద్రంలోని పెద్దలతో ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ కూడా అయ్యారు. దీంతో 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందని బీజేపీ- టీడీపీ – జనసేన దోస్తీకి లైన్ క్లియర్ అయిందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

ఇంతలో అనూహ్యంగా పాత కేసుల పరంపరను వైసీపీ నాయకులు అందుకున్నారు. వరుసబెట్టు విమర్శలు చేశారు. ఫైనల్ గా వాటితో వేటితోను సంబంధం లేని స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ను తెరపైకి తీసుకొచ్చి ఏకంగా చంద్రబాబుని అరెస్టు చేశారు. ఇక్కడే ఒక అదృశ్య శక్తి పని చేసిందని ఆ డైరెక్షన్ లోనే అంతా జరిగిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయానికి ఏపీ సీఎం జగన్ దేశంలోనే లేరు. ఆయన వచ్చేసరికి అంతా జరిగిపోవాలని ఆదేశం ఉన్నట్టు ప్రచారం. దానికి తగ్గట్టుగానే అధికారులు అత్యుత్సాహం.. కోర్టుల దగ్గర హడావిడి.. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిపోయాయని అంటున్నారు. అంతటితో ఆగకుండా సీఐడీ చీఫ్, అడిషనల్ ఏజీ పోటీపడి మరి హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్‌మీట్లు నిర్వహించారు. జాతీయ స్థాయిలో చంద్రబాబుని బదనామ్ చేస్తే లబ్ధి పొందేది ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న.

Also Read: నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!

ఇంతకాలం చంద్రబాబు కోర్టుల్ని మేనేజ్ చేసి బతికేశారు అని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనేజ్‌మెంట్‌ వీక్ అయిందా లేక ఆ మేనేజ్‌మెంట్లో మరింత సిద్ధహస్తులైన వారి హస్తం ఇందులో చొరబడిందా? ఈ అంశంపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. సహజంగానే న్యాయ ప్రక్రియలో ఒక ఆరోపణ చేసినప్పుడు దాని నుంచి బయటకు రావడానికి పద్ధతి ప్రకారమే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ.. వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబుని జైలుకు పరిమితం చేయాలనేది అసలు ఎత్తుగడ. అందులో భాగంగానే ఒక కేసులో అరెస్టు చేసి తామర తంపరగా మరిన్ని కేసులు బనాయించడం ద్వారా ఈ న్యాయ ప్రక్రియలో జరగబోయే జాప్యాన్ని ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి ఒక అవకాశంగా తీసుకోవాలని పెద్దల సూచన. అందుకు ప్రధానమైన కారణం నాలుగున్నరేళ్లుగా అనేక విమర్శలు, అవినీతి ఆరోపణలతో చంద్రబాబు ఐదేళ్ల పాలనను తవ్విపోసినా ఎక్కడా ఇసుమంతైన దోషం కనిపించలేదు. అక్కడక్కడ వేగంగా పనిచేయడంలో భాగంగా ఏర్పడిన లోపాల్ని ఆసరాగా తీసుకుని ఆరోపణల పరంపరని కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కినట్టు సమాచారం. ఇక కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ ఒక్క అంశాన్ని అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడని వైసీపీ నాయకులు చకచకా అమలు చేసేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: ‘వాలంటీర్లే వేస్ట్ అనుకుంటే.. వారికింకా ట్రైనింగా?’

ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎందులోనూ చంద్రబాబు నాయుడులా అనుభవశాలి మరొకరు లేరు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాబల్యం మరొకసారి పెరిగే అవకాశం ఉంది. ఆ క్రెడిబిలిటీని దెబ్బతీయటమే ఎజెండాగా రాష్ట్రంలో ఉన్న కుమ్ములాటలని ఢిల్లీ పెద్దలే వ్యూహం ప్రకారం అరెస్టులు దాకా తీసుకెళ్లారనే వాదన బలపడుతోంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా చంద్రబాబు అరెస్ట్ అప్రజా స్వామికమని ఖండించినా, కేంద్రంలోని పెద్దలు ఎవరు దీనిపై స్పందించడంలేదు. మరోవైపు ఏపీ బీజేపీని ఒక దశ వరకు కంట్రోల్ చేసి, తెలంగాణ బీజేపీ నాయకులతో మాత్రం ఈ అరెస్టుపై సానుభూతి వచనాలు వల్లె వేయిస్తున్నారు. ఇక్కడే అసలు కిటుకు ఉందనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సాయాన్ని కోరితే బాబు ఏపీ పొత్తుతో మెలిక పెట్టారా? అనే సందేహం కలుగుతుంది. ఏకంగా అవినీతి ముద్ర వేస్తే రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలోనూ చంద్రబాబు ప్రాబల్యం కోల్పోతారనేది వ్యూహకర్తల ప్రణాళిక. అయితే సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు పైనే ఈ అంశం అంతా ఆధారపడి ఉందని తెలుగుదేశం నాయకత్వం బలంగా నమ్ముతుంది. మౌనంగా పోరాటం సాగిస్తూనే పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు ఈ అదృశ్య హస్తం గుర్తు కూడా చెప్పాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్ర రాజకీయాలకి తెరదీసే అసలు కుట్రదారులు ఎవరో అతి త్వరలోనే తేలిపోతుందని తెలుగుదేశం నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.