TTD: పక్షపాతమా… దైవ రహస్యమా ?

మహిళలు ఎందుకు చైర్మన్ లు కాలేదు... గోవిందా ?

Share this :

( మస్తాన్ . గగ్గుటూరి, రాయచోటి, అన్నమయ్య జిల్లా )

స్వామి… గోవిందా… వేంకటేశ్వర… మీకు సేవ చేసేందుకు మహిళలు అనర్హులా స్వామి?

ఇంతవరకూ తిరుమల తిరుపతి దేవస్థానానికి మహిళలు ఎందుకు చైర్మన్ లు కాలేదు… స్వామి గోవిందా ?

ప్రపంచంలో గొప్పదైన ” భారత రాజ్యాంగం లో ” లింగ సమానత్వం ఎక్కడ ?

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి… గోవిందా… జనార్దనా… శ్రీనివాసా… నీకు… నా చిన్న విన్నపం స్వామి…

నేను నిత్యం నీ పేరు తలుస్తూ, నీ పూజలో నిమగ్నమయ్యే నీ భక్తురాలు “వెంగమ్మ” ను స్వామి...

స్వామి నాకు చిన్న సందేహం స్వామి… చెప్పమ్మా… వెంగమ్మా…

స్వామి మీ ముందు ఆడ, మగ, చిన్న , పెద్ద అన్న తేడా లేదు… అందరూ సమానమే కదా… లింగ బేధం లేదు కదా స్వామి…

అవునమ్మా… పాప పుణ్యాలు, ఖర్మ ఫలితాలు ఎవరివి వారివే తల్లీ…

అవునా … నాయనా…గోవిందా…

మరి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కి చైర్మన్ పదవిని మాతృ మూర్తులమైన మా లాంటి మహిళలకు ఎందుకు కేటాయించడం లేదు… గోవిందా…

ఈ రోజే మన రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది…

నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు…

ఆయన మంత్రి వర్గం సైతం ప్రమాణ స్వీకారం చేసింది…

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలి చైర్మన్ రాజీనామా చేశారు…

మీ ఆజ్ఞతో ఏర్పడే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు..? నేటి వరకూ ఒక మహిళా చైర్మన్ కానీ, ఈఓ కానీ లేకపోవడం ఏంటి స్వామి ?

మహిళలం ఆ పదవిలో నెగ్గుకు రాలేరన్న సందేహమా ? లేక ఏదైనా దైవ రహస్యం ఉందా ?

అందరూ సమానమే అని నేను చెప్తున్నా కదా తల్లి…

మీకై మీరు రాసుకున్న రాజ్యాంగం లోనూ లింగ సమానత్వం ఉందని రాసుకున్నారు… మరి పదువులు మహిళలకు ఇవ్వాలి..! ఇవ్వకపోతే పోరాడాల్సింది మీరే కదా?

నేనేం చేయాలి… రాష్ట్రాన్ని పాలించే రాజు లింగ బేధం లేకుండా సమానత్వం చూపాలి…

ఇప్పటికైతే ఇంకా ఎవరు చైర్మన్, ఎవరు కొత్త ఈఓ తెలీదు కదా..?

ఏమో గుర్రం ఎగరా వచ్చు కదా వెంగమ్మ తల్లీ…

మీరే రాజుకు స్వప్నం లో సత్యాన్ని బోధించాల్సి ఉంది స్వామి…

దేవస్థాన గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల మరింత వ్యాప్తి చెందేలా… అమ్మలైన శ్రీదేవి భూదేవి లా పాలించే శక్తి మాకు ఉందని నిరూపించుకునే అవకాశం కల్పించమని ఉపదేశించి మహిళా శక్తికి మేలు కల్గించు స్వామి…

రాష్ట్ర రాజు గారు… మీ ఆశీస్సుల కోసం మీ వద్దకు వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ పదవి మహిళకు ఇచ్చేలా ఆయనకు హితబోధ చేసి మహిళా చైర్మన్ ను కుర్చీ లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత తండ్రిగా మీదే స్వామి…

గోవిందా…ముకుంద… మురారి…

చైర్మన్ గా మహిళే ఉంటుందని మిమ్మల్ని విశ్వసిస్తున్నాను స్వామి… మీ పాదదాసురాలు వెంగమ్మ…