జానపద బ్రహ్మ బి విఠలాచార్య దర్శకత్వం (Vithalacharya Movies) వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తెరకెక్కించారు. విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana) సంకల్పించి.. ‘జై విఠలాచార్య (Jai Vithalacharya)’ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ‘మూవీ వాల్యూమ్ మీడియా’ ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Tollywood Director Trivikram) చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం (అక్టోబర్ 1) జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.
‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పులగం చిన నారాయణ నాకు బాగా పరిచయం. ఆయన ఇంతకు ముందు రాసిన పుస్తకాలు కూడా నేను చదివా. ఇప్పుడు విఠలాచార్యపై పుస్తకం రాశారు. విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందే.. తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూశాం. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు.
Also Read: ‘వాలంటీర్లే వేస్ట్ అనుకుంటే.. వారికింకా ట్రైనింగా?’
ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులగం చిన్నారాయణకు, రవి, పబ్లిషర్ జిలానీకి కంగ్రాచ్యులేషన్స్. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదు. సినిమాపై వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. పుస్తకాలు అంటే అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నా. చరిత్రను రికార్డ్ చేయడం అనేది తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణ ఇంకా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆయనకు ఆ శక్తి, ఆసక్తి… రెండూ ఉన్నాయి కాబట్టి పుస్తకాలు ఇలాగే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని చెప్పారు.
అనంతరం పులగం చిన్నారాయణ మాట్లాడుతూ.. ‘విఠలాచార్య సినిమాలు తీసినంత వేగంగా ఈ పుస్తకం రాశాను. సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, వాణీశ్రీ, రాజశ్రీ, జయమాలిని, నరసింహ రాజు.. ఇలా ఎందరో అతిరథ మహారథులతో ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. అలాగే, విఠలాచార్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. తెలుగులో విఠలాచార్య దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంద’ని చెప్పారు.
Also Read:‘గ్యాస్ బాంబుల్లా పేలుతోన్న పాల ప్యాకెట్లు..!’ కంస మామా ఏందిదీ?
సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ.. ‘సీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ ఆఖరి పెయింటింగ్ తో ఈ పుస్తకం కవర్ పేజీ రూపొందింది. త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం సంతోషంగా ఉంది. పులగం చిన్నారాయణ ఎంతో పరిశోధన చేసి… ఎంతో మందిని కలిసి విఠలాచార్యపై పుస్తకం తీసుకు వచ్చారు. తెలుగు సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న ఆయన మరిన్ని పుస్తకాలు తీసుకు రావాలని కోరుకుంటున్నానని’ చెప్పారు.
షేక్ జీలాన్ బాషా మాట్లాడుతూ.. ‘జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్ గా అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరించారు. అదొక మరపురాని అనుభూతి. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్‌కు కృతజ్ఞతలు’ అని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’
