‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

'పిచ్చివాగుడు వాగితే పులివెందులలో కూడా గెలుపు కష్టమే' జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామకృష్ణం రాజు ఫైర్‌

Share this :

అమరావతి, అక్టోబర్ 2: రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టే విధంగా జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ప్రభుత్వం ప్రణాళికను రచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే వారం ఈ ప్రక్రియకు టెండర్లను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆ టెండర్లు ఎవరికి దక్కుతాయో కూడా త్వరలోనే తేలనుంది. అప్పుడు నేను చెప్పింది నిజమా? కాదా? అన్నది రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. నేను అనుకునే పాలెగాళ్ళకే ఇస్తారా?, లేకపోతే కొత్త పాలెగాళ్ళను తెస్తారా?? అన్నది చూడాలి. ఏది ఏమైనా సముద్రం ఒడ్డున లభించే ఖనిజాలను తన అనుయాయులకు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమం (RRR Rachabanda)లో భాగంగా రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఈ మేరకు మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

Also Read: నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!

రాష్ట్ర ప్రభుత్వం ఖనిజాలను తవ్వడానికి టెండర్లను ఆహ్వానించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతిని ఇస్తుందని అనుకోవడం లేదు. అయినా, ప్రభుత్వ పెద్దలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఈ ఐదు ఆరు నెలల వ్యవధిలో ఖనిజ సంపదను పంచేసుకోవాలని ఏమైనా ఒప్పందాలు చేసుకుంటే, రాబోయే ప్రభుత్వం ఊరుకోదు. అన్ని ఒప్పందాలను రద్దు చేస్తుంది. రాష్ట్ర సంపదను ఈ రకంగా దోచేయాలనుకుంటే వారు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది. జగన్‌మోహన్ రెడ్డితో అంట కాగుతోన్న కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇటువంటి తప్పు చేస్తారని భావించడం లేదు. అన్నీ తెలిసి ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టు వ్యవహరిస్తారా?, లేకపోతే మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని తెగబడతారా ? అన్నది చూడాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సముద్రం ఒడ్డున లభించే ఖనిజాలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చాపురం నుంచి మొదలుకొని తడ వరకు 900 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉంది. ఈ సముద్ర తీరం ఒడ్డున లభించే ఖనిజాల ద్వారా లభించే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాలని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట తవ్వకాలకు దరఖాస్తులు చేయించారు. వ్యక్తిగత స్వార్థం లేని విజినరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లభించే ఖనిజ సంపద ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరాలని భావిస్తే… ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎక్కడ ఏ ఆదాయ వనరున్న గుటుక్కున స్వాహా చేస్తున్నారనేది సుస్పష్టం. రాష్ట్రంలోని సువిశాల సముద్రతీరంలో లభించే ఖనిజాలను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకానికి పర్యావరణ హానికారక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతులను నిషేధించింది.

Also Read: ‘వాలంటీర్లే వేస్ట్ అనుకుంటే.. వారికింకా ట్రైనింగా?’

అయినా, ఈ ఖనిజాల తవ్వకానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రధానికి జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సముద్రం ఒడ్డున లభించే ఖనిజాల తవ్వకానికి అనుమతులను ఇవ్వకపోయినప్పటికీ, సబ్జెక్టు క్లియరెన్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది . ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఒక పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్ కంపెనీలతో పరోక్షంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ సంస్థల బ్యాలెన్స్ షీట్ కు సరిపోయే విధంగా నిబంధనలను పొందుపరిచారు. ఎందుకంటే, ఎవరు పడితే వారు ఇందులో దూరకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం మినరల్ మైనింగ్ కు అనుమతిస్తే, మైనింగ్ చేసిన ఇసుక, ఇసుక తవ్వకాల బాధ్యతలను తన పాలెగాళ్లకు కేటాయించేందుకు ముఖ్యమంత్రి రెడీ అయ్యారు. ఇప్పటికే బొగ్గు మట్టి తవ్వకాలలో తలపండినవారు, ప్రస్తుతం మా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్స్ గా కొనసాగుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇసుక విక్రయాలకు డిజిటల్ పేమెంట్స్ అంగీకరించకుండా, ప్రజల కోసమే నగదు లావాదేవీలను కొనసాగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్త భాష్యాన్ని చెప్పారని ఎద్దేవా చేశారు. జేపీ కంపెనీని పేపర్ పై చూపెడుతూ ఇసుక తవ్వకాలు అన్ని ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే కొనసాగాయి . టర్న్ కి అనే సంస్థను కూడా చూపించి వాళ్ల పేరిట వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Also Read:‘గ్యాస్‌ బాంబుల్లా పేలుతోన్న పాల ప్యాకెట్లు..!’ కంస మామా ఏందిదీ?

చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ ప్రభుత్వం.. మా పార్టీ కాదు!

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసింది జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మా పార్టీ కాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించే నిరసన నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని అన్నారు. అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తన అక్రమ అరెస్టును నిరసిస్తూ నారా చంద్రబాబు నాయుడు జైలులోనే ఒకరోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆయనకు మద్దతుగా రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తోపాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఒకరోజు నిరసన నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు మోత మోగిద్దాం కార్యక్రమం దిగ్విజయమైందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలోనూ ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఢిల్లీలో నారా లోకేష్ తో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని పత్రికలు టీవీ చానల్స్ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని పేర్కొంటే, సాక్షి మీడియా మాత్రం మోగనిమోత కార్యక్రమం అంటూ శునకానందాన్ని పొందుతోందని విమర్శించారు.

అవినీతి గురించి విజయసాయి రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే..

అవినీతి గురించి వైయస్సార్‌ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తిరుపతిలో 3000 మంది కూర్చోవడానికి వీలుగా ఉన్న ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహిస్తే, కేవలం 600 మందికి మించి హాజరు కాలేదంటే ఆ పార్టీ పని అయిపోయినట్లేనని స్పష్టమవుతుంది. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంతో మానసిక ఆందోళనతో 97 మంది మృతి చెందారు. గతంలో మాదిరిగా చనిపోయిన వారి విషయంలో ఎవరు దొంగలెక్కలను చూపలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు వేలాది మంది చనిపోయారని పేర్కొన్నారు. కానీ ఆయన కొడుకు, కూతురు, చుట్టూ ఉన్నవారికి కనీసం తలపోటు కూడా రాలేదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిలు రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ న్యాయస్థానాల ముందు ఉంచారు. కోర్టుకు వెళితే ఎక్కడ తమ నేరాలు రుజువవుతాయేమోనని భయంతో A1, A2లు ప్రజాసేవలో బిజీగా ఉన్నామని తొక్కలో కబుర్లు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అవతలి వారిపై నిందలు వేసి తాము మహాపురుషులం అన్నట్లుగా ఫోజు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడుపై రూ. 300 కోట్ల అవినీతి అభియోగాన్ని మోపారు . గత ఐదేళ్లలో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకు తిన్నారు. రూ.300 కోట్లతో 200 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎక్విప్‌మెంట్‌తో సహా ఏర్పాటు చేసి లక్షలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, ఇప్పుడు నైపుణ్య శిక్షణ కేంద్రాలే కనిపించడం లేదంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవని అనుకోవాలా? అనే సందేహాన్ని రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు. రూ. 300 కోట్ల అవినీతి అభియోగాల నుంచి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.

ఇలా పిచ్చివాగుడు వాగితే పులివెందులలో కూడా గెలుపు కష్టమే

టీడీపీ, జనసేన మైత్రిని చెడగొట్టాలని కొంతమంది కొవర్టులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్న వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునివ్వగా, టీడీపీ నాయకత్వాన్ని సోషల్ మీడియాలో ఎవరైనా నిందిస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రెండు పార్టీలకు చెందిన నాయకులు సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్తుండడంతో, ఆ పార్టీ నాయకత్వానికి గుండెల్లో వణుకు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. గాలి వాన ఏకమై వస్తే వంద గొడ్లు తిన్నరాబంధు.. అతని బంధువులతో సహా కొట్టుకుపోవడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు పరిశీలిస్తే మా పార్టీకి ఏడు నుంచి 8 స్థానాలు వస్తే అదే చాలా గొప్ప అనిపిస్తోంది . నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒంగోలులో గతంలోనే తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు వచ్చాయని, ఈసారి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నారు.

Also Read: Mystery Box at Vizag: వైజాగ్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన మిస్టీరియస్‌ పెట్టె! తెరచి చూడగా..

కడప జిల్లాలో మా పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు లభించవచ్చు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెగ్గుతారని అందరూ అంటున్నారు. చిత్తూరులో ఒకటి నుంచి రెండు స్థానాలు గెలిచినా.. ఎలా లెక్క పెట్టుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌ పార్టీ 15 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాగే పిచ్చివాగుడు వాగితే పులివెందులలోను గెలుపు కష్టమేనని ప్రజలు అంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 175 కు 175 స్థానాల్లో గెలుస్తామని అనుకోవడం తప్పులేదు. కానీ ఇతరుల వ్యక్తిత్వ హననానికి ఒక స్థాయిని మించి మాట్లాడడం తప్పు. ఒకసారి సంకలో దూరడం.. ఆ తరువాత నిందిస్తూ మాట్లాడడం సరికాదని విజయసాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. పాలెగాడి పోస్ట్ పీకినప్పుడు ఒకలాగా మాట్లాడి, పాలగాడి పోస్ట్ ఇవ్వగానే మరొకలా మాట్లాడడం ఎంతో విద్యావంతుడైన విజయసాయి రెడ్డికి తగదు. నీ యజమాని నీపై చూపెట్టే ప్రేమ తాత్కాలికం. ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడితే మంచిది. విజయ సాయి రెడ్డికి తెలియకుండానే కొన్ని ట్వీట్లు మరుగుజ్జువాడు పెడుతున్నాడు. ట్వీట్లు మరుగుజ్జువాడు పెడుతున్నప్పటికీ, తిరుపతిలో విజయసాయి రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ కి తప్ప రియల్ ఎస్టేట్‌ రంగానికి వర్తించదు

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని గతంలో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది కేవలం స్టాక్ మార్కెట్ కు మాత్రమే వర్తిస్తుందని, రియల్ ఎస్టేట్ రంగానికి వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి మానవేందర్ రాయ్ తీర్పునిచ్చారు. హైకోర్టు తీర్పును జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయగా, హైకోర్టు తీర్పుతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై గతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిపారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు గతంలోనే సమాధానం ఇచ్చినట్లయింది. ఇక ప్రస్తుతం ఆయనపై నమోదు చేసిన కేసుల్లో పస లేదు. అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ బోర్డు తీర్మానం మేరకు టీడీపీ అధికారంలో లేనప్పుడు భూములు కొనుగోలు చేసింది. రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థకు వందలాది చిల్లింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో కూడా సంస్థ అవసరాల కోసం భూములు కొనుగోలు చేసి ఉంటారు. రాజధాని ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తే ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని పేర్కొనడంతో పాటు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారని కేసులు నమోదు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది రూల్ అవుట్ అయ్యింది.

ముందుగా భూమి కొనుగోలు చేసి దానికి అనుగుణంగా ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్ మార్చారని అంటున్నారు. హెరిటేజ్ భూములు ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డు కు కిలోమీటరన్నర దూరంలో ఉన్నాయి. అలాగే ఈ భూములకు రెండు కిలోమీటర్లు, లేదంటే రెండున్నర కిలోమీటర్ల దూరంలో గతంలోనే జాతీయ రహదారి ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ఈ భూముల విలువ పెరుగుతుందని అనడానికి అవకాశం లేదు. ప్రతిపాదిత ఇన్నర్ రింగురోడ్డు ప్రణాళికా సమయములో నారా లోకేష్ మంత్రి కాదు. అందులో ఆయన ప్రమేయం లేదు. నారా లోకేష్ పై కేసు నమోదులో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కుయుక్తి కుట్ర ఉంది తప్ప ఈ కేసులలో ఎటువంటి పస లేదు. కోర్టు ముందు ఈ కేసులు నిలబడే ఛాన్స్ లేనేలేదు. కొన్ని డబ్బా చానల్స్ లోకేష్‌ను అరెస్టు చేస్తారంటూ.. తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. లోకేష్ వెంట్రుక కూడా పీకలేరు. తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సీఐడీ పోలీసులను నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించి, కాఫీ అందజేసి మరీ పంపారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Also Read: Ghost Dreams: రాత్రిళ్లు దెయ్యం కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

ఈ నెల 3వ తేదీనే చంద్రబాబు నాయుడు కేసు విచారణ

స్కిల్ డెవలప్‌మెట్ స్కీం స్కామ్ రిమాండ్ రిపోర్టును స్వాష్ చేయాలని కోరుతూ నారా చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ 3వ తేదీనే అత్యున్నత ధర్మాసనం విచారించనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈనెల ఆరవ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది అంటూ వైయస్సార్‌ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని చేస్తోందన్నారు. 3వ తేదీనే సప్లిమెంటరీ లిస్టులో మూడవ కేసుగా ఇప్పటికే కోర్టులో చంద్రబాబు నాయుడు కేసు లిస్ట్ అయ్యిందన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టులో నారా చంద్రబాబునాయుడుకి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కామ్ కేసు నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందని ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. దీనితో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ఆశాభంగం తప్పదన్నారు.