నేడు ఏపీలో ‘మోతమోగిద్దాం’ నిరసన..

చంద్రబాబుకు సంఘీభావంగా ప్రజాశ‌బ్దం వినిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన నారా లోకేష్

Share this :

అమరావతి, సెప్టెంబర్ 29: రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని రోజులుగా వాడివేడిగా ఉన్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ తర్వాత రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంఘీభావంగా వినూత్న నిరసన చేపట్టేందుకు లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రజాగ్రహాన్ని రుచిచూపిద్దామంటూ ‘బాబుతో నేను’ పేరిట ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీన (శనివారం) రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఐదు కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా వినూత్నంగా నిరసన తెలపాలన్నారు.

ఇంట్లో ఉన్నా.. ఆఫీస్‌లో ఉన్నా.. ఎక్కడున్నా బయటికొచ్చి గంట లేదా ప్లేట్‌ మీద గరిటెతో కొట్టడం లేదా విజిల్‌ వేయాలని ప్రకటించారు. ఒకవేళ రోడ్డు మీద వాహనంలో ఉంటే హారన్‌ కొట్టాలని కోరారు. ఇలా ఎవరు ఏం చేసినా దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో #Mothamogiddham హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయాలని లోకేష్‌ కోరారు. జగన్‌ కక్షపూరిత చర్యలను ఎండగట్టడానికి నడుం బిగించారు. ఈ మేరకు చంద్రబాబుకి సంఘీభావంగా ప్రజాశ‌బ్దం వినిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ మీద కూడా కేసులు బనాయించడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు బెయిల్‌కు లోకేష్‌ పెట్టుకున్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శుక్రవారం లోకేష్‌ తరపు లాయర్లు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ వరకు వాయిదా వేసింది. అప్పటి వరకూ లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

లోకేష్‌ను విచారించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14, స్కిల్‌ స్కామ్‌లో A41 కింద సీఐడీ నోటీసులివ్వనుంది. మరోవైపు ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కూడా అక్టోబర్‌ 4కు హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో బాబు A1 నిందితుడిగా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.