అమరావతి, అక్టోబర్ 7: ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీ శాసనసభ్యుల్లో టెన్షన్ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందో, రాదో అన్న సందేహం మెజారిటీ శాసనసభ్యుల్లో వ్యక్తం అవుతుంది. రానున్న ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావో, రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో జరగనున్నాయి. అందుకే వచ్చే ఎన్నికలను (AP Elections 2024) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నాలుగైదు రకాల సర్వేలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడానికి సిద్ధమవుతున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో ఊహించిన విధంగా 152 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 175 అసెంబ్లీ స్థానాల లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని ఎదుర్కోవడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏది ఏమైనా తిరిగి అధికార పీఠం మీద కూర్చోవాలని దృఢ సంకల్పంతో జగన్ ఉన్నారు. ఇందుకనుగుణంగా రాష్ట్రంలో, కేంద్రంలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా.. నవరత్నాల పేరుతో ప్రకటించిన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కేంద్రం కాళ్ళా, వేళ్ళబడి నిధులను సమకూర్చుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టి బటర్ నొక్కే కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఇంటికి ఒకటి రెండు కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే విధంగా పథకాలను రూపొందించారు. ఈ పథకాల అమలు అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా వార్డు వాలంటీర్లు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఏదైనా పథకంలో అర్హత కలిగిన లబ్ధిదారులు తప్పిపోతే తిరిగి వారికి లబ్ధి చేకుర్చుతున్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు లబ్ధి పొందాలి అన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇందుకు పగడ్బందీగా వార్డు సచివాలయాల ద్వారా కార్యక్రమాలను నడిపిస్తున్నారు.
Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’
రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంటే, పలువురు శాసనసభ్యులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రకృతి వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి 20% వరకు కమీషన్లను డిమాండ్ చేస్తున్నారు. కమీషన్లు ఇవ్వనిదే కానీ పనులు మంజూరు, బదిలీలు జరగడం లేదు. నియోజకవర్గంలో ఇసుక, గ్రానైట్, ఎర్రచందనం తదితరాల అక్రమ రవాణా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి ఎక్కడికక్కడ కైవసం చేసుకుంటున్నారు. మళ్లీ టికెట్ వస్తుందో, రాదో.. వస్తే గెలుస్తామో లేదో.. అన్న సందేహం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. ఇందుకు అనుగుణంగా గత ఎన్నికల్లో ఖర్చుపెట్టిన దానికంటే పది రెట్ల సొమ్మును సంపాదించడానికి నానా ప్రయాసలు పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వ్యయం చేయడానికి నిధులను కూడా పోగేసుకుంటున్నారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ పై అలా స్పందించిన నటుడు నరేష్!
ముఖ్యమంత్రి జగన్ ప్రతినెల ఎమ్మెల్యేల పనితీరును వివిధ వర్గాల ద్వారా నివేదికల రూపంలో తెచ్చుకుంటున్నారు. ఐప్యాక్ (I-PAC) సభ్యులు ఒకవైపు నిఘా పెడుతున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు వెళుతున్నాయి. ఇవి కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంను పార్టీ తరఫున సిద్ధం చేశారు. వీరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆమలును పర్యవేక్షిస్తున్నారు. శాసనసభ్యుల అవినీతి, అవకతవకల మీద నిత్యం నివేదికలు సమర్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే శాసనసభ్యుల మీద డేగ కళ్ళు పనిచేస్తున్నాయి. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేల పర్యటనల గురించి ఆరా తీస్తున్నారు. సక్రమంగా నియోజకవర్గాల్లో పర్యటించని ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు జగన్ హెచ్చరిస్తూ వస్తున్నారు.
అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తీరును మార్చుకోవడం లేదు. అందరికీ టికెట్లు ఇవ్వలేమని జగన్ ఒక సారి ప్రకటించడంతో పార్టీలో కలకలం బయలుదేరింది. అప్పటినుండి జగన్ టికెట్ల విషయంలో గుంబనంగా ఉంటున్నారు. ఎవరి మాటను వినడం లేదు. మంత్రులు, జిల్లాస్థాయి నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతి జిల్లాలో సగం మంది కొత్త ముఖాలు ఎన్నికల బరిలో కనిపించే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు ఎంత వారైనా వారిని పక్కన పెట్టడానికి జగన్ సిద్ధమయ్యారు. ఈ విషయాలను తెలుసుకున్న శాసనసభ్యుల్లో వణుకు ప్రారంభమయ్యింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.

2 Comments
Comments are closed.