AP Politics: ‘రాష్ట్రంలో రాజ్యమేలుతున్న రెడ్డి సామాజిక వర్గం’ జగనన్నా.. సామాజిక సమతుల్యం ఎక్కడన్నా?

అన్ని కీలక పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం వారే.. పవర్ లేని డమ్మీ పోస్టుల్లో బీసీలు, దళితులు.. ఇదెక్కడి న్యాయం!

Peddireddy Ramachandra Reddy and RK Roja Reddy Peddireddy Ramachandra Reddy and RK Roja Reddy
Share this :

చిత్తూరు, అక్టోబర్‌ 3: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సామాజిక న్యాయం అపహాస్యం అవుతోంది. రిజర్వు పదవులలో తప్ప బీసీలు, ఎస్సీలు కనిపించడం లేదు. అనధికార పదవులే కాదు.. జిల్లా అధికారులు సైతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొనసాగుతున్నారు. అర్హత లేకున్నా, విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే.. చిత్తూరు జిల్లా (Chittoor district) రెడ్డి రాజ్యంగా మారి పోయింది. పేరుకు ప్రజాస్వామ్యం అయినప్పటికీ పాలనఅంతా రెడ్డి సామాజిక వర్గం (Reddy community) చేతిలోనే ఉంది. ఎస్సీ, బీసీ నాయకులకు కొన్ని పదవులు ఇచ్చినా కర్ర పెత్తనం మాత్రం రెడ్లదే. జిల్లాలో వెనుకబడిన వర్గాలకు, దళితులకు ZPTC, MPTC, సర్పంచ్, వార్డు సభ్యులు, ఆలయాల పాలకమండలి సభ్యుల పోస్టులు మాత్రమే ఉంటాయి. అధికారం చెలాయించే పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గం దగ్గర కేంద్రీకృతం అవుతున్నాయి. అధికారం లేని పోస్టులను BCలకు, దళితులకు ఎరగా వేస్తున్నారు. ఎక్కడ అయినా ఛైర్మన్, మండల పరిషత్తు అధ్యక్షులు ఉన్నా.. ఉపాధ్యక్షులు మాత్రం రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు. అలా సెట్ చేస్తున్నారు. అధికారంలేని పదవుల్లో BCలు, దళితులు ఉండగా.. జిల్లా అధికారం చెలాయించే జిల్లా అధికారులను నియంత్రించే పదవుల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతలు చెలామణి అవుతున్నారు. Also Read: Chandrababu Naidu Arrest: అరెస్టు వెనుక అదృశ్య హస్తం? అక్టోబర్ 3పైనే ఆశలన్నీ?

జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడు ధనంజయ రెడ్డి

జిల్లాలో మూడు ప్రముఖ దేవాలయాలు ఉండగా.. శ్రీకాళహస్తిలో మాత్రమే BC సామాజిక వర్గానికి చెందినా అంజూరు శ్రీనివాసులు ఛైర్మన్‌గా ఉన్నారు. TTD, కాణిపాకం దేవస్థానాలకు రెడ్డి సామాజిక వర్గం వారే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. TTD చైర్మన్ గా BC సామాజిక వర్గానికి చెందినా జంగా కృష్ణముర్తికి అవకాశం కల్పిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు. శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా నగరికి చెందినా చక్రపాణి రెడ్డి నియమితులయ్యారు. జిల్లా పరిషత్తు చైర్మన్ BC కావడంతో ఉపాధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ధనంజయ రెడ్డిని నియమించారు. జిల్లా పరిషత్తు CEOగా ప్రభాకర్ రెడ్డి అదనపు బాధ్యతలతో విధులు నిర్వహిస్తున్నారు. ఇది వరకు మున్సిపాలిటి, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు ఒకరు ఉపాధ్యక్షులుగా ఉండగా, జగన్ ప్రభుత్వం ఇద్దరి ఉపాధ్యక్షులను నియమిస్తూ GO తీసుకువచ్చింది. దీంతో అదనంగా వచ్చిన వారు కూడా అదే సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవాలయాల పాలకమండళ్ళు, మార్కెట్టు కమిటి ఛైర్మన్‌ పోస్టులలో కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలకే పెద్దపీట వేశారు.

తిరుపతి నగరాభివృద్థి సంస్థ ఛైర్మన్ మోహిత్ రెడ్డి

తాజాగా తిరుపతి నగరాభివృద్థి సంస్థకుకూడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే మోహిత్ రెడ్డి. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రానున్న మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్‌గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు మోహిత్ ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అదనంగా తుడా ఛైర్మన్‌ పదవిని చేపట్టాడు. అంతేకాదు, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా ఆయనే. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మొహిత్ రెడ్డి బరిలోకి దిగడం లాంఛనమే.Also Read: ‘లోకేష్‌పై పెట్టిన కేసుల్లో పసలేదు.. సుప్రీంలో బాబుకు విజయం ఖాయం’

టీటీడీకి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అభినయ్ రెడ్డి

మరోవైపు ఈ మధ్యనే మరోసారి టీటీడీకి ఛైర్మన్‌గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. దీనిని బట్టి చూస్తే.. ఇటు చెవిరెడ్డి, అటు భూమన ఈ రెండు కుటుంబాలలో పదికి పైగా పదవులు ఉన్నాయి. అంతే కాదు, తిరుమల కొండపైన ఛైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. కొండ కిందకి వస్తే తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో వారే ఉన్నారు.

14 నియోజక వర్గాలలో ఏడుగురు రెడ్డి ఎమ్మెల్యేలు

ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజక వర్గాలలో ఏడుగురు రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. జగన్ మంత్రి వర్గంలో జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్కే రోజా రెడ్డికి చోటు కల్పించారు. దళిత వర్గానికి చెందిన నారాయణ స్వామి ఉప ముఖ్య మంత్రి పదవిలో ఉన్నా పట్టించుకునే వారు లేరు. పైగా కొందరు రెడ్డి నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి టీటీడీ పాలక మండలి ఛైర్మన్ పదవి ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆ పదవి ఇస్తానని ఊరించి ఆకరికి రెడ్డికే ఇచ్చారు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారు. తిరుపతి మేయర్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఉన్నప్పటికీ పెత్తనం అంతా డిప్యూటీ మేయర్, కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిదే.

తిరుపతి కలెక్టర్‌గా వెంకట్రామ రెడ్డి, ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి..

తిరుపతి కలెక్టర్‌గా వెంకట్రామ రెడ్డి, ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు. చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు కంటే ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌ ఎంసీ విజయానంద రెడ్డి మాటకే చెల్లుబాటు ఎక్కువ. చిత్తూరు ఎస్పీగా రిషాంత్ రెడ్డి ఉన్నారు. చుడా అధ్యక్షునిగా సి పురుషోత్తం రెడ్డి కొనసాగుతున్నారు. ప్రభుత్వ సలహాదారులుగా పెనుమూరుకు చెందిన మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, వెదురుకుప్పం మండలానికి చెందిన డాక్టర్ వాసుదేవ రెడ్డి (అమెరికా) ఉన్నారు. పేరుకు బీసీలు అయిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఇద్దరు రెడ్లు ( పల్లె రెడ్డి)గానే చలామణి అవుతున్నారు. ఇక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అధికశాతం రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇందుగలరు అందు లేరని చెప్పడం కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై ఒక వైకాపా నాయకుడిని ప్రశ్నిస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని సమర్ధించుకున్నారు. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ ఎందరు బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిందో చెప్పమని ఎదురు ప్రశ్నవేశారు. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే జిల్లాలో బలిజ, బీసీ, ఎస్సీలకు అధికారం ఎండమావే అనిపించక మానదు.