ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబుని కలిసి రాబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నారు. గురువారం తిరుపతిలో జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు దిగ్విజయం సాధిస్తుందని.. రేపు రాబోయేది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన,టీడీపీ కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలకు, నాయకులకు, వీరమహిళలకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, పలువురు వీర మహిళలు పాల్గొన్నారు. పోత్తులు తర్వాత తిరుపతి లో కొత్త కమిటీలు ఉంటాయని.. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపితో కలిసి జనశ్రేణులు అందరూ ముందుకు సాగాలని కిరణ్ రాయల్ అన్నారు.
