ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (AP Development Scam) కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అక్రమ అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి తరుణంలో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రమైన అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా గత 25 రోజులుగా టీడీపీ (TDP) శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు (Chandrababu Arrest) నిరసనగా రాష్ట్ర పిలుపు మేరకు బాబుతో నేను అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించిన వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి అధ్వర్యంలో బాబుతో నేను పోస్టర్లను నియోజవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆదివారం రాజంపేటలో నియోజకవర్గ ఇన్‌చార్జి బత్యాల చెంగల రాయుడు చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేయాలని గంటా నరహరి అనుచరులు ఆయన వద్దకు వెళ్లడం, ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనితో గంటా నరహరి అనుచరులు అయోమయానికి గురైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రాజంపేట అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే బత్యాల చెంగల్ రాయుడు, చమర్తి జగన్మోహన్ రాజు టిక్కెట్ తమకే అనే ధీమాలో ఉండగా,యువకుడు,పారిశ్రామిక వేత్త గంటా నరహరి రాజంపేట పార్లమెంట్ కు కాకుండా అసెంబ్లీ అభ్యర్థిగా నిలపాలని అధిష్టానం పావులు కదుపుతున్నట్టు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపధ్యంలో ఆయన రాజంపేట పట్టణంలో పార్టీ కార్యాలయం కూడిన నివాస గృహం కొనుగోలు చేయడం,పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధం చేయడం బలం చేకూరుస్తోంది.
గతంతో గంటా నరహరితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నేతలు ముందస్తు జాగ్రత్తగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ (TDP MLA Ticket) రేసులో ఉన్న నేతలు గంటా నరహరిని (Ganta Narahari) దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏకతాటిపై నడవవలసిన నాయకులు వర్గ బేధాలు పెట్టుకోవడం వల్ల పార్టీకి తీరని నష్టం కలిగే అవకాశం ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర కమిటీ నాయకులు రాజంపేట నియోజకవర్గ టీడీపీలో పరిస్థితులు చక్కదిద్దకపోతే, రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Wife Sold Her Husband: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య
