Skill Development Scam: చంద్రబాబు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్‌..!

'బెయిల్ స్టేజ్ లోనే సాక్షాలు లేవని ఏపీ హైకోర్టు అనడం సరైనది కాదు'

Share this :

అమరావతి, నవంబర్‌ 21: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Scam) టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)కు హైకోర్టు (AP High Court) బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఏపీ సీఐడీ (AP CID) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో దర్యాప్తు దశలోనే కేసులో సాక్షాలు లేవని చెప్పడం హైకోర్టు తన పరిధిని అతిక్రమించడమేనని పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేసి, చంద్రబాబు (Chandrababu) బెయిల్‌పై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

చంద్రబాబు (Chandrababu Naidu), తెలుగు దేశం (TDP) పార్టీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని సోమవారం కోర్టు అభిప్రాయపడింది. నిధులు టీడీపీ ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ (సీఐడీ) వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని కోర్టు పేర్కొంటూ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: AP High Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు.. తీర్పు వెలువరించిన హైకోర్టు

మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh) ఆరోపణలు మరోలా ఉన్నాయి. స్కిల్ స్కాం కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, బెయిల్ స్టేజ్ లోనే సాక్షాలు లేవని ఏపీ హైకోర్ట్ అనడం సరైనది కాదని పేర్కొంది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని, చార్జీ షీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లేనని తెల్పింది. టీడీపీ అకౌంట్‌లో ఊరు పేరు లేని రూ.371 కోట్ల నగదు జమయింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. సిమెన్స్ అంతర్గత నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమాలు బయటపడ్డాయి. ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపింది. మినీ ట్రైలర్ నిర్వహించడం చట్ట విరుద్ధమని, ఇది ముమ్మాటికీ సామాజిక ఆర్థిక కుంభకోణం అంటూ ఏపీ సర్కార్‌ అత్యున్నత ధర్మాసనంలో వేసిన పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.