తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరు పొందిన, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా మారుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు.ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు మరియు డీన్‌లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై పూర్తి దృష్టి సారించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తరువాత ఈ సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు ఎంతో అవసరమైన సమాచారాన్ని అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని వారు సూచించారు.
పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరం వుంది అని తెలిపారు.అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వారు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న మరియు తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి వంటి వారు పాల్గొనడం జరిగింది.
