ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం: నాగబాబు

Share this :

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతి‌పక్ష పార్టీ నేతలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇక ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఆదివారం తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల సమావేశం అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులకు జనసేన భయపడదన్నారు. జనసైనికులు భూములు దోచుకుంటేనో… స్కామ్ లు చేశారనో కేసులు పెట్టించుకోలేదని, న్యాయం, ధర్మం కోసం పోరాటం చేస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు. గతంలో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించలేదన్నారు.అందుకే తమ పార్టీ నాయకుల్లో ఆత్మ స్థైర్యం నింపి, క్షేత్ర స్ధాయిలో జరిగే అనేక అంశాలపై అందరితో మాట్లాడేందుకు వచ్చామన్నారు. అధికార పార్టీ జనసైనికులు ఏ పని చేసినా అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. అలాంటి కక్ష్య పూరిత చర్యలు ఆ పార్టీకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. 

ఎవరు సిఎం అవ్వాలనే దానికంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. తమ నాయకుడికి ప్రజల శ్రేయస్సు ముఖ్యమన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. టిడిపి కూడా అదే ధోరణితో ఉండటం వల్ల కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరు సిఎం కావాలనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. జనసేనలో నాయకత్వ లోపం లేదని, జనసైనికులంతా నాయకులేనన్నారు. కోట్లు కొల్లగొట్టే నాయకులు తమ పార్టీలో లేకపోవడం తమ అద్రుష్టమన్నారు. ఒకరు దెబ్బతింటే వారిని తొక్కేసి పైకి రావాలని జనసేన ఎప్పటికీ ప్రయత్నం చేయదన్నారు. అవకాశవాద రాజకీయాలు, నీచ రాజకీయాలను జనసేన ఎప్పటికీ చేయదన్నారు. చంద్రబాబు ఆ పరిస్థితిల్లో ఉన్నప్పుడు ఆయనకు, టిడిపికి తమ నాయకుడు ఒక భరోసా ఇచ్చారన్నారు.

ఇక జనసేనలో 99 శాతం మంది పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతామన్నారు. డాక్టర్ హరిప్రసాద్ లాంటి నాయకులు చిత్తూరు జిల్లాకు చాలని, భూ ఆక్రమణలు చేసిన వాళ్లు, వందల కోట్లు దోచుకున్న వారు తమకు అవసరం లేదన్నారు. వారాహి యాత్ర రాయలసీమలో చాలా బలంగా నిర్వహించబోతున్నామన్నారు. అంతకు ముందు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కువగా పెరిగిపోయాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ప్రజా సమస్యల పట్ల జనసైనికులు పోరాటం చేస్తున్నారన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ ను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని క్షేత్ర స్ధాయిలో బలోపేతం చేసి… పార్టీ జెండాను గడపగడపకూ తీసుకువెళతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ కలికొండ శశిధర్, జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, కీర్తన, నియోజకవర్గ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.