ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వైసీపీ భూస్థాపితం ఖాయం అంటూ కామెంట్స్ చేశారు. గత ఎన్నికలకు ముందు దశలవారీగా మద్య నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి 40,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.
రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే వెనుకడుగు వేయరని ఎన్నికల ముందు పార్టీ తరఫున విడుదల చేసిన ప్రచార వీడియోలలో చెప్పుకున్నారు. మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఈ నాలుగున్నర ఏళ్లలో చేసింది ఏమిటి? అని ప్రశ్నించారు. జగన్ మావయ్య వస్తాడు మద్య నిషేధం చేస్తాడని ఎన్నికల ముందు చిన్నారి చేత అడ్వర్టైజ్మెంట్ లో చెప్పి ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత , అదేమద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే . మహిళల పసుపు, కుంకాలు నిలబడాలంటే మద్య నిషేధం ఒక్కటే మార్గమని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే మద్యంపై వేల కోట్ల రూపాయలను గడ్డిమేసినట్లుగా మేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో విక్రయిస్తున్న జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లలో హానీకారక పదార్థాలు అధిక మోతాదులో ఉన్నాయి.
రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా మద్యం సేవించాల నుకుంటే, మద్యం షాపు వారు ఇచ్చింది తాగాలి తప్పితే… మరొక బ్రాండ్ అందుబాటులో ఉండదు. గతంలో క్వాలిటీ మద్యం క్వార్టర్ 50 రూపాయలకు లభిస్తే, ఇప్పుడు అదే క్వార్టర్ నాసిరకమైన మద్యం 150 నుంచి 160 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆడాన్ శరత్ చంద్రారెడ్డి తయారు చేస్తున్న మద్యం, విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి బినామీ కంపెనీలు తయారు చేసే మద్యాన్ని సేవించిన వారు త్వరగానే పైకి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. మూడు నుంచి నాలుగు విడతలలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, 25 ఏళ్ల పాటు మద్య నిషేధం చేయబోమని చెప్పి అండర్ టేకింగ్ ఇచ్చి దాదాపు 40 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు . ఎన్నికల ముందు చెప్పింది చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఆయన చొక్కా ముట్టుకోవడం కాదు కదా… శాంతియుతంగా కొవ్వొత్తి పట్టుకొని నిరసన తెలియజేస్తున్న వారిపై కూడా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
అక్రమంగా కూడబెట్టిన ఆదాయంతో రానున్న ఎన్నికల్లో ఓటుకు పదివేల రూపాయల కాకపోతే 20వేల రూపాయలైనా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేస్తారు. ఇదంతా మహిళలు దాచుకోవాల్సిన డబ్బు. వారి భర్తల మద్య వ్యసనాన్ని అడ్డుపెట్టుకుని మద్యాన్ని నగదు ద్వారా విక్రయిస్తూ, జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు. ఎన్నికల్లో డబ్బులు పంచే వారి వద్ద తీసుకునే హక్కు మహిళలకు ఉంది. డబ్బులు తీసుకొని ఓటు వేయడం నేరం. డబ్బులు ఇచ్చిన వారికి కాకుండా వేరే వారికి ఓటు వేసి , తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలని కోరారు. మా పనికిమాలిన వారు ఇచ్చే డబ్బులను తీసుకొని, ప్రజా సేవ చేసే వారికి ఓటు వేయాలి. ఎందుకంటే ప్రజాసేవ చేసే వారి వద్ద ఎన్నికల్లో పంచడానికి డబ్బులు ఉండవని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టి సొమ్ములు లాగేసిన దుష్ట దరిద్ర దామోదరులకు ఓటు వేయవద్దని ఆయన కోరారు.
