విశాఖపట్నం, సెప్టెంబర్ 30: విశాఖపట్నం (Vizag) సాగర తీరానికి భారీ సైజులో ఉన్న ఓ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 29) సముద్ర అలలకు వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఈ భారీ చెక్కపెట్టె (mystery wooden box) స్థానికంగా కలకలం సృష్టించింది. సముద్ర తీరంలో కొందరు పర్యాటకులు, మత్స్యకారులు నిన్న రాత్రి ఈ పెట్టెను గమనించారు. అందులో ఏముందా..? ఎక్కడి నుంచి ఆ పెట్టె కొట్టుకొచ్చిందా? అనే పలు అనుమానాల నడుమ పోలీసులకు సమాచారం అందించారు.
వైఎంసీఏ బీచ్ తీరానికి రాత్రి 10. 30 గంటల సమయంలో కొట్టుకొచ్చిన భారీ పెట్టె బరువు సుమారు వంద టన్నుల వరకు బరువు ఉంది. పైగా చూసేందుకు అచ్చం పురాతనకాలం నాటి చెక్క పెట్టె మాదిరి ఉండటంతో బీచ్‌లో ఉన్న సందర్శకులతోపాటు స్థానికులు దానిని చూసేందుకు ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అసలు ఆ పెట్టెలో ఏముందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆ పెట్టెలో పెద్దమొత్తంలో సంపద ఉండే అవకాశం ఉందని అనుకున్నారంతా..! ఇలాంటి పెట్టె బీచ్‌కు కొట్టుకు రావడం ఇదే తొలిసారి అని స్థానికులంతా చర్చించుకున్నారు. ఏదైనా షిప్ నుంచి ఆ బాక్స్ పడిపోయిందేమోనని.. లేక ఎవరినైనా హత్య చేసి ఇలా బాక్స్‌లో పెట్టారా.. లేదంటే శత్రు దేశాలు ఏదైనా విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారా.. వంటి ఎన్నో అనుమానాల నడుమ శుక్రవారం రాత్రంతా గడిచి పోయింది.
Also Read: నేడు ఏపీలో ‘మోతమోగిద్దాం’ నిరసన..
పోలీసులు రెండు ప్రొక్లెయిన్ల సహాయంతో భారీ పెట్టెను ఒడ్డుకు చేర్చారు. రాత్రంతా పెట్టెకు పోలీసులు జాగ్రత్తగా కాపలాగా ఉన్నారు కూడా. వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకువచ్చిన ఈ భారీ చెక్క పెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మిస్టీరియస్ పెట్టె గుట్టు పసిగట్టేందుకు పోలీసులు ఆర్కియాలజీ విభాగానికి సైతం సమాచారం ఇచ్చారు. ఈ రోజు (శనివారం) ఆ చెక్కపెట్టెను రెండు ప్రొక్లెయిన్ల సహాయంతో పగలకొట్టడంతో దాదాపు 14 గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.
Also Read: Ghost Dreams: రాత్రిళ్లు దెయ్యం కలలు ఎందుకు వస్తాయో తెలుసా?
ఈ వ్యవహారంలో గుట్టు పసిగట్టేందుకు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వాడ్‌ల పర్యవేక్షణలో ప్రొక్లెయిన్‌లతో అధికారులు పెట్టెను పగలకొట్టారు. ఈ దృశ్యం వీక్షించేందుకు అక్కడ పెద్ద మొత్తంలో జనసమూహం గుమికూడటంతో హడావిడి నెలకొంది. ప్రొక్లెయిన్లతో బాక్స్ పగలగొట్టే సీన్స్‌తో విశాఖ తీరం గంభీరంగా తయారైంది. పది అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఆ పెట్టెను పగలకొట్టిన అరగంట సేపు ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూడగాసారు. ఎట్టకేలకు బాక్స్‌ను పగలగొట్టి చూడగా లోపలున్న దృశ్యం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. వెలకట్టలేని సంపద, వజ్రవైడుర్యాలు ఉంటాయని భావిస్తే.. పెట్టె లోపల చెక్క దూలాలు ప్రత్యక్షమయ్యాయి. అందులో సుమారు 50 వరకు కర్ర స్లీపర్‌లు ఉన్నాయి. అది కేవలం చెక్క దిమ్మెగా నిర్దారించడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.పెద్ద పెద్ద షిప్పుల్లో లంగర్ కోసం వీటిని ఉపయోగిస్తుంటారని అక్కడి జాలర్లు తెలిపారు.
Also Read: నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!
