నల్గొండ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలోని ఓ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావటంతో అతనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు తహసీల్దార్ ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో శనివారం (సెప్టెంబర్ 30) ఉదయం 8 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వివరాల్లోకెళ్తే..
Also Read: నేడు ఏపీలో ‘మోతమోగిద్దాం’ నిరసన..
పెట్టెలో కొట్ల రూపాయల నోట్లు
నల్గొండ జిల్లా మర్రిగూడలో ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లోని ఎంఆర్‌ఓ మహేందర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో రెండు కోట్ల రూపాయల నగదు దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. తహసీల్దార్ మహేందర్‌రెడ్డితోపాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లు వంటి ఇతర 15 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది.
Also Read: Mystery Box at Vizag: వైజాగ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన మిస్టీరియస్ పెట్టె! తెరచి చూడగా..
ఆరోపణలు నిజమయ్యేలా భారీగా ఆస్తులు లభ్యం
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులకు మహేందర్ రెడ్డిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హస్తినాపురంలో ఉన్న మహేందర్ రెడ్డి ఇంటితోపాటు మర్రిగూడలో ఉన్న తాహసీల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆరోపణలు నిజమయ్యేలా ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం.
Also Read: Ghost Dreams: రాత్రిళ్లు దెయ్యం కలలు ఎందుకు వస్తాయో తెలుసా?
