TDP Nakka Anand Babu మంగళగిరి, నవంబర్ 18: ఏలూరు (Eluru)లో పేదలకు భూపంపిణీ (land Distribution) పేరుతో జగన్ తన అక్కసు మొత్తం చంద్రబాబు (Chandrababu)పై వెళ్లగక్కాడని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) అన్నారు. భూములపై సర్వహక్కులు కల్పిస్తున్నానని పైకి చెబుతున్నా.. మరోపక్క సెజ్‌లు, థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇతర కారణాలు చెప్పి ఇప్పటివరకు రాష్ట్ర (Andhra Pradesh)వ్యాప్తంగా 14లక్షల ఎకరాల పేదల భూములు లాక్కున్నాడని మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం (నవంబర్ 17) ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఈ విధంగా మాట్లాడారు..
ఆక్రమించుకున్న అసైన్డ్ భూముల్లో ఒక్క ఎకరమైనా దళితులకు తిరిగిచ్చారా?
రాష్ట్రంలో (Andhra Pradesh) దళితులు, బీసీలు, ఇతర వర్గాల సాగులో ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని (Assigned lands) ఇళ్లపట్టాల కోసమని, అభివృద్ధికోసమని కట్టుకథలు చెప్పి వైసీపీ నేతలు అడ్డగోలుగా లాగేసుకున్నారు. జగన్ ఇడుపుల ఎస్టేట్‌లోనే దళితులకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ఆ భూములు తిరిగి ఇస్తున్నట్టు అసెంబ్లీలోచెప్పి తప్పించుకున్నాడు. ఒక్కఎకరం కూడా దళితులకు తిరిగివ్వలేదు. ఒక్క ఎకరమైనా రాజశేఖర్ రెడ్డి వెనక్కు ఇచ్చినట్టు కడపజిల్లా కలెక్టర్ చెప్పగలడా? జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితుల నుంచి తన కుటుంబం కొట్టేసిన భూములకు చుట్టూ కంచె వేసుకొని వాటిని అనుభవిస్తున్నాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పెద్దదోపిడీదారు పేదలకు భూ హక్కులు కల్పిస్తానని చెప్పడం ముమ్మాటికీ నమ్మకద్రోహమే. జగన్ తాత, తండ్రి ఆక్రమించుకున్న అసైన్డ్ ల్యాండ్స్‌ను దళితులకు ఇచ్చాకే భూహక్కులపై మాట్లాడాలి.
వైసీపీనేతలు కొల్లగొట్టిన పేదల భూములపై సర్వహక్కులు కల్పించడానికే భూరక్ష అని కట్టు కథలు
ఇప్పుడు కొత్తగా జగన్ రెడ్డి భూములపై సర్వహక్కులు కల్పిస్తానని చెప్పడం కూడా తన స్వప్రయోజనాల్లో భాగమే. నాలుగేళ్లలో వైసీపీనేతలు, జగన్ వర్గానికి చెందిన వారు దళితుల్నిభయపెట్టి, బలవంతంగా భూముల్ని తమ పేర్లపై రాయించుకున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి 40వేల ఎకరాలు కొల్లగొట్టాడు. అలానే జిల్లాలవారీగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరులు కాజేసిన భూములపై, వారికే సర్వహక్కులు కల్పిస్తానని జగన్ రెడ్డి అంటున్నాడు. కానీ నిజమైన భూ హక్కుదారులకు కాదు. ఎల్‌టీఎస్ (ల్యాండ్ పర్చేజ్ స్కీమ్) కింద ఎస్సీ కార్పొరేషన్ దళితులకు ఇచ్చిన 22,837 ఎకరాలపై హక్కులు కల్పిస్తున్నట్టు జగన్ చెప్పాడు. చంద్రబాబు 2014-19మధ్య దళితులకు 5,386 ఎకరాలు కొని దళితులకు ఇచ్చారు. అంతకు ముందు కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా ఆయనే దళితులకు వేల ఎకరాల భూములు కొనిచ్చాడు.
నాలుగున్నరేళ్లలో అదే స్కీమ్ కింద జగన్ ఏ ఒక్క దళితుడికైనా ఒక్కఎకరం భూమి కొనిచ్చాడా? కొనివ్వడం కాదుకదా.. దళితులు ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్ని ఇళ్లపట్టాల పేరుతో బల వంతంగా గుంజుకున్నాడు. పేదలకు సెంటుపట్టాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, మంత్రులు రూ.7వేల కోట్ల వరకు ప్రజలసొమ్ముని దిగమింగారు. 1954 నుంచి నాటి ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములకు జగన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా హక్కులు కల్పించేది ఏమిటి? దళితుల్ని మభ్యపెట్టి.. వారి ఆర్థిక అవసరాలు, ఇబ్బందుల్ని ఆసరాగా తీసుకొని వైసీపీనేతలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వారి అధీనంలోని భూముల్ని లాగేసుకున్నారు. అలా లాక్కున్నవారి పక్షాన జగన్ భూహక్కులు అంటున్నాడు గానీ.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి కాదు.
చదవండి: Selfie in Voting Booth: సెల్ఫీ దిగితే ఓటు హక్కు రద్దు.. 3 నెలల జైలు శిక్ష! ఎందుకో తెలుసా..
చుక్కల భూములకు చుక్కలు పెట్టడం.. ఎంచక్కా అందినకాడికి దోచేయడం..
చుక్కల భూములకు చుక్కలు పెడుతోంది జగన్ ప్రభుత్వమే. 2 లక్షల ఎకరాల భూములుంటే వాటిలో లక్షా 50వేల ఎకరాలకు జగన్ అతని పార్టీ వారే చుక్కలు పెట్టించి, భూయజమానుల్ని భయపెట్టి, వారి నుంచి అందిన కాడికి దండుకున్నారు. భూ సర్వేకు సరైన యంత్రాంగం లేదు. రాష్ట్రంలో రెండు సార్లు జరిగిన సర్వే అంతా తప్పుల తడక. సర్వే రాళ్లపై తనబొమ్మలు వేసుకోవడానికి, పాసుపుస్తకాలపై తన ఫొటోలు వేసుకోవడానికే జగన్ ఉత్తుత్తి సర్వే లతో జనాల్ని మోసగించాడు. గతంలో జరిగిన సర్వేలన్నీ తప్పుల తడకలుగా ఉంటే.. వాటిలోని లోపాలను సరిదిద్ది భూయజమానులకు న్యాయం చేయకుండా, మరలా కొత్తగా మూడో విడత సర్వే చేయించి, రైతుల్ని, భూహక్కుదారుల్ని ఇంకా ముంచేస్తానంటున్నాడు. చీమల పుట్లలో పాములు చేరినట్టు వైసీపీవారే దళితులు, ఇతర వర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు. అసైన్డ్ ల్యాండ్స్, చుక్కల భూములు, 22ఏ భూములు, వక్స్ భూములు అన్నీ చెరబట్టారు. ఒక్క సెంటుభూమికైనా గిరిజనులకు జగన్ ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా ఇచ్చాడా?
జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే దళితులపై దారుణాలు ఎక్కువయ్యాయి. దళితుల్ని చంపే హక్కుని తనపార్టీ వారికి రాసిచ్చినట్టుగా జగన్ నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబుని వెన్నుపోటుదారు అంటున్న జగన్ రెడ్డిని మించిన గొడ్డలిపోటు దారు మరొకరు ఉండరు. బాబాయ్ ని చంపి, అధికారంలోకి వచ్చిన ఈ ఘనుడి రక్తచరిత్ర ప్రజలకు తెలియదా? తండ్రి చనిపోగానే శవాన్ని పక్కనే పెట్టుకొని ముఖ్యమంత్రి కావడంకోసం ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాడు. 2019లో జగన్ రెడ్డి ఏడుపు చూడలేకే ప్రజలు నమ్మి ఓట్లేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు జనాలకు ఏడుపే మిగిలింది. మరలా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్‌ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామని ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు దళితుల్ని అలా అన్నాడు.. ఇలా అన్నాడని నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం కాదు జగన్ రెడ్డి.. దమ్ముంటే ఎక్కడ ఎవరిని ఏమన్నాడో నిరూపించాలని ఆనంద్ బాబు సవాల్ చేశారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
