‘గ్యాస్‌ బాంబుల్లా పేలుతోన్న పాల ప్యాకెట్లు..!’ కంస మామా ఏందిదీ?

అంగన్వాడీ పాలప్యాకెట్ల నాణ్యతపై నారా లోకేష్‌ ఫైర్‌

Share this :

అమరావతి, సెప్టెంబర్‌ 30: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పసి పిల్లలు, బాలింతలకు సరఫరా చేసే టెట్రా పాల ప్యాకెట్లు ఉబ్బి.. బాంబుల్లా పేలడం తీవ్ర దుమారం లేపుతోంది. ఈ నేపథ్యంలో పసి పిల్లలకిచ్చే పాలనూ వదలవా అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ‘ఇందే ఖర్మ మన రాష్ట్రానికి’, ‘కంస మామ జగన్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు.

‘పసిపిల్లలకిచ్చే పాలనూ వదలవా సైకో జగన్! రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు. ఈనెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చూపుతోన్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీ వరకు ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా.. సరఫరా చేసిన రెండు రోజులుకే ఈ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ మోహన్‌ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందంటూ ట్వీట్‌లో మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పాల ప్యాకెట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబర్‌ 14వ తేదీన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దావులూరు, కొల్లిపర తదితర గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు టెట్రా పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటిని ఆయా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు సెప్టెంబర్‌ 21 నుంచి లబ్ధిదారులకు అందజేశారు. అయితే కొల్లిపరలో ఉన్న ఓ అంగన్‌వాడీ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టెట్రా పాల ప్యాకెట్లు తెచ్చుకుని ఫ్రిజ్‌లలో నిల్వ చేసుకున్నారు.

Also Read: నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!

సెప్టెంబర్‌ 29 (శుక్రవారం) ఓ మహిళ ఫ్రిజ్‌లో నుంచి పాల ప్యాకెట్ బయటకు తీయగా అది ఉబ్బిపోయి ఉండటం చూసి షాక్‌కు గురయ్యింది. ప్యాకెట్‌ను కత్తిరించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా పగిలి.. పాలన్నీ పైకి చిమ్మాయి. అందులో ఉన్న పాలు కూడా చెడిపోయినట్లు గుర్తించింది. దీంతో అంగన్‌వాడీలో తనకు పంపిణీ చేసిన పాలు నాణ్యతగా లేవని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు.. పాడైపోయిన ప్యాకెట్లు తీసుకుని మంచి వాటిని అందజేశారు. రీఫిల్‌ ప్యాకింగ్‌ పాలు కావడం వల్ల రిఫ్రిజిరేటర్‌లో పెడితే, అవి చెడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాలప్యాకెట్ల ప్యాకింగ్‌ చేయడంలో లోపాల కారణంగా అలా జరిగి ఉంటుందన్నారు. ఈ ఘటనపై నారా లోకేష్ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.

Also Read: నేడు ఏపీలో ‘మోతమోగిద్దాం’ నిరసన..