MP Raghu Rama Krishna Raju: ‘నారా లోకేష్ యువగళం చేసే శబ్దానికి ఈ ప్రభుత్వం పునాదులు కదలడం ఖాయం’.. ఎంపీ రఘురామ

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌ను పదేళ్లు జైల్లో పెట్టిస్తా...

Share this :

MP Raghu Rama Krishna Raju Press Meet ఢిల్లీ, నవంబర్‌ 28: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh Yuvagalam) రాజోలు నుంచి ప్రారంభించిన రెండవ దఫా యువ గళం పాదయాత్ర ప్రజాగళంగా మారనుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Rama Krishna Raju) అన్నారు. ప్రజల గళంగా మారనున్న యువ గళం శబ్దానికి పాలకపక్షం పునాదులు కదిలి, కూలిపోయే పరిస్థితులు ఎంతో దూరంలో లేదన్నది స్పష్టం అవుతుందన్నారు. నారా లోకేష్ ప్రసంగానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించిందన్నారు. బస్సు యాత్ర, తుస్సు యాత్రలో, జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan) సభకు బలవంతంగా తరలించినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లు ప్రజలు ఎదురు చూసేవారు. కానీ లోకేష్ యువ గళం పాదయాత్ర సభలో మాత్రం ప్రజల నుంచి చక్కటి ప్రతిస్పందన లభించిందనా సోమవారం (నవంబర్‌ 28) రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ రఘురామ మీడియాతో అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ..

నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర విశాఖపట్నం వరకు కొనసాగనుంది. విశాఖపట్నం (Visakhapatnam)లో డిసెంబర్ 8వ తేదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులు కొత్త ఇంట్లో పాలు పొంగించనున్నారట. దీనితో విశాఖకు భూకంపం రావడం ఖాయమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 8వ తేదీన జగన్‌ సతీమణి భారతి రెడ్డి జన్మదినోత్సవం కావడంతో, ప్రజాధనంతో నిర్మించిన 450 కోట్ల రూపాయల ప్యాలెస్ ను ఆమె జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కానుక ఇస్తారేమోనని రఘురామ అన్నారు. విశాఖపట్నం వెళ్లిన, వెనక్కి రాక తప్పదన్నారు. జగన్‌ వస్తున్నారంటేనే ప్రజలకు భూకంపం గుర్తుకు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా నాకు ఒక పాయింట్ గుర్తుకు వచ్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలుకలు, కుక్కల వంటి మూగజీవులు చిన్న మార్పును బ్రహ్మాండంగా పసిగడుతాయి. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి పోవడం ఖాయం. కొత్త ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమయ్యిందని రఘురామ తెలిపారు.

చదవండి: TS Elections 2023: తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం.. అమల్లోకి 144 సెక్షన్‌

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌ను పదేళ్లు జైల్లో పెట్టిస్తా

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆడమన్నట్లుగా ఆడి అక్రమ కేసులు నమోదు చేసి, ప్రజలను వేధించిన సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను పదేళ్లపాటు జైల్లో పెట్టిస్తానని రఘురామ శపథం చేశారు. గత రెండు రోజులుగా ప్రభుత్వ పెద్దల అవినీతి అక్రమాలకు సహకరించిన అధికారులంతా మాతృ సంస్థలకు తిరిగి వెళ్తామని బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మారనుందని తెలిసి పోలీసు అధికారుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సునీల్ కుమార్ లాంటి అధికారి బదిలీపై ఎక్కడకు వెళ్లినా వెనక్కి రప్పిస్తాం. అలాగే ఎక్స్‌ట్రా ఆర్టిస్టులుగా తానా అంటే తందానా అన్న వారిని కూడా కారాగారంలో బంధిస్తాం. ఢిల్లీకి వెళ్లిపోతే, కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని అనుకుంటున్నారేమో… మా స్టడీ మేము చేశామని రఘురామ హెచ్చరించారు. అలాగే ప్రస్తుత సీఐడీ చీఫ్ సంజయ్, గతంలో సీఐడీలో విధులు నిర్వహించి ప్రస్తుతం బీహార్ లో విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ వంటి అధికారులపై చర్యలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక నేరాభియోగ కేసుల్లో నిందితురాలిగా విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి తెలంగాణకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారట. అలాగే సీతారామాంజనేయులు కేంద్ర సర్వీసులోకి వెళతానని ప్రభుత్వ పెద్దల అనుమతిని కోరుతున్నారట. అలాగే, కోస్ట్ గార్డ్ సర్వీస్‌కు చెందిన వెంకట్ రెడ్డి కూడా మాతృ సంస్థకు వెళ్తానని చెబుతున్నారట. వీరంతా బదిలీపై ఎక్కడకు వెళ్ళినా వారు చేసిన తప్పులకు శిక్ష తప్పదు.

మైనింగ్, గనుల శాఖ సంచాలకునిగా విధులను నిర్వహించిన వెంకట్ రెడ్డి, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు 400 నుంచి 500 కోట్ల రూపాయల పెనాల్టీలు వేసి ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇబ్బందులు పెట్టారు. ఇక ఇసుక కాంట్రాక్టు జెపి సంస్థకు కట్టబెట్టామని చెప్పినప్పటికీ, కాంట్రాక్టు తీరిపోయిన తర్వాత కూడా అదే సంస్థ ముందు పెట్టి ప్రభుత్వ పెద్దల బంధువులు ఇసుకను దోచుకున్నారు. ఇందుకు సహకరించిన వెంకట్ రెడ్డి మాతృసంస్థకు వెళ్ళిపోతానని దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ, ఆయన్ని అంత సునాయసంగా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ రెడ్డి కూడా బదిలీపై వెళతానని అంటున్నారు.

ఇలా ప్రభుత్వ శాఖలలోని 13 మంది కీలక అధికారులు మాతృ సంస్థకు, కేంద్ర సర్వీసులకు వెళ్తామని దరఖాస్తులు చేసుకోవడం వెనక, వారికిప్పటికే సినిమా అర్ధమయ్యింది. ప్రజల నాడిని అర్థం చేసుకున్న అధికారులు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం వాలంటీర్లతో ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారని రఘురామ ధ్వజమెత్తారు. వాలంటీర్లకు జేబులో సొమ్ము ఇస్తున్నట్లుగా బిల్డప్పులు ఇస్తూ, వారితో ప్రజలని భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వారికి పదవిపోవడం అంటే తలకాయలు పోయినట్టేనని రఘురామ తెలిపారు . ఓట్ల రూపంలో ప్రజలకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, దారుణంగా తీర్పు ఇస్తారని… ఇది రాబోయే రోజుల్లో మనమంతా చూస్తామన్నారు. ప్రస్తుతానికి టీజర్లు చూపించి, పోలింగ్ రోజున ప్రజలు అసలు సినిమా చూపిస్తారన్నారని ఎద్దేవా చేశారు. బదిలీకి దరఖాస్తు పెట్టుకున్న అధికారుల తీరును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

సాక్షి దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్లో రూపంలో లాభం

ఆటాడుకుందాం రా పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న క్రీడాకారులకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ సాక్షి దినపత్రికకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో లాభం వస్తుందని రఘురామ అన్నారు. ఆటాడుకుందాం రా కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖ క్రీడాకారుల ఫోటోను ఉపయోగించి ఉంటే బాగుండేది. దానికి కూడా ముఖ్యమంత్రి ఫోటోనే ముద్రించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.