తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో వివాదాల తేనె తుట్టను కదిపినట్లైంది. ఆ యూట్యూబ్ ఛానల్ లో చెప్పిన అంశం మరింత వివాదాన్ని సృష్టిస్తోంది. దీంతో లోకేష్ వ్యవహార తీరుపైన మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ మండిపడుతున్నాయి. ఆ ఛానల్ కంటే సబ్ స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న తమను విస్మరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలచిన తమను విస్మరించడం ఏమిటని నిలదీస్తున్నాయి. లోకేష్ చర్య ఒకరకంగా వివాదాలకు కేంద్ర బిందువు అయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ చర్య కారణంగా భవిష్యత్తులో సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలుగులో 200 పైగా రాజకీయ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వీటిలో సుమారు 70 వరకు చురుగ్గా ఉన్నాయి. వీటికి గణనీయమైన సబ్ స్క్రైబర్స్ కూడా ఉన్నారు. పలు చానల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. అధికార వైసిపి పార్టీని విమర్శిస్తూ, ఆ పార్టీ చేస్తున్న అవకతవకలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన విశ్లేషణలను వివిధ రాజకీయ నాయకులు, పరిశీలకులతో ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రజలకు అందిస్తున్నాయి. ఒక రకంగా 90% యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అయితే అన్ని చానల్స్ ను విస్మరించి ఒక యూట్యూబ్ ఛానల్ కు మాత్రం లోకేష్ ఇంటర్వ్యూ ఇవ్వడం వివాదంగా మారింది. తమకేం తక్కువని ఇతర యూట్యూబ్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆ యూట్యూబ్ ఛానల్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారని, చూసే గంటల నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ని పక్కన పెట్టి రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు.చాలా మంది జర్నలిస్ట్స్ కూడా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయని… వాటిని టీడీపీ పార్టీ,లోకేష్ చిన్నచూపు చూస్తున్నారని అర్థంచేసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.
లోకేష్ ఇంటర్వ్యూ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ లో చెప్పిన అంశం కారణంగా వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పోత్తుకొనసాగుతోంది. అయితే ఉమ్మడి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది? ఇరు పార్టీల అధినేతలు ఇప్పటివరకు ప్రకటించలేదు. అది తనకు సంబంధించిన వ్యవహారం అని, తాము చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ విషయమై చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామన్నారు. అయితే లోకేష్ ఒక అడుగు ముందుకు వెళ్లి రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో సందేహం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పలువురు కోరుకుంటున్నారని వివరించారు. దీంతో వివాదాస్పదమైన ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ప్రస్తావించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. ఇరు పార్టీల అధినేతలే ఈ విషయమై మౌనంగా ఉన్న సమయంలో లోకేష్ కుండ బద్దలు కొట్టడం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లోకేష్ ఇంటర్వ్యూను అడ్డం పెట్టుకొని జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి నష్టం కలగచేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. రాష్ట్రంలోని అన్ని యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది సాధ్యం కాని పని. అలాగని ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చి మిగిలినవారికి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వారు అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంది. ఎన్నికల కీలక సమయంలో నారా లోకేష్ వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి అనర్థం కలిగించేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై నష్ట నివారణ చర్యలు ఏం తీసుకుంటారో వేచిచూడాలి.
