CM VIJAY: సీఎం విజయ్ ఆఖరి సినిమాకు తప్పని సెన్సార్ కష్టాలు..!

సీఎం విజయ్ సినిమాకు సెన్సార్ కష్టాలు..!

Share this :

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) థియేటర్లలోకి రాకముందే సరికొత్త వివాదాలు, సంచలనాలతో వార్తల్లో నిలుస్తోంది. గతేడాది డిసెంబర్ నుండి ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) వద్దే నిలిచిపోయింది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడొకరు ఫిర్యాదు చేయడంతో, ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు, అంటే దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ సినిమా నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అధినేత వెంకట్ కే నారాయణ ఓ గుడిలో దర్శనానికి వచ్చిన సమయంలో మీడియా దీనిపై ప్రశ్నించగా ఆయన స్పందించారు. తాము ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ కోసమే ఎదురుచూస్తున్నామని, అది ఏ క్షణంలోనైనా రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ చేతికి రాగానే విడుదల తేదీని ముందే ప్రకటిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, తాము ఈ సినిమాకు ‘జన నాయగన్’ అని పేరు పెట్టామని, ఇప్పుడు విజయ్ సార్ నిజంగానే తమిళనాడు ప్రజల నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మారడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రొడ్యూసర్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదల చేయాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. కోర్టుల చుట్టూ తిరిగినా చిత్ర యూనిట్‌కు ఎలాంటి ఉపశమనం లభించలేదు.

ఈ లోపే సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం, ఆ తర్వాత విజయ్ తమిళనాడు సీఎం కావడం వంటి ఎన్నో పరిణామాలు జరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) బిజినెస్ మీటింగ్స్‌లో ఉన్న నిర్మాత వెంకట్‌ను.. సీఎం విజయ్ హుటాహుటిన చెన్నైకి తిరిగి రావాలని కోరినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల పనులను స్వయంగా పర్యవేక్షించి, సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

leave a reply