గురువారం వైసీపీ అధినేత, వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ రియాక్ట్ అయ్యారు. నేడు బీజేపి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి మీడియా ముందుకు వచ్చిన పయ్యావుల.. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తాడు అంటూ మండిపడ్డారు. గతంలో నన్ను సన్మానించాలని అన్నాడు… నిన్నటికి నిన్న తనంత మంచోడు లేడని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేసారు.
వివేకా హత్య కేసులో ఏం జరిగిందో నిక్కరు వేసుకున్న కుర్రాడు కూడా చెబుతాడు… అలాంటి వాటిల్లో కూడా జగన్ అసత్యాలు చెబుతున్నారుని.. వైఎస్ కుటుంబంతోనే రాజకీయాలు నేరమయ్యాయి… రాజకీయాల్లోకి ఫ్యాక్షన్ తెచ్చారని విమర్శించారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీమలో ఫ్యాక్షనిజానికి అండగా నిలిచిందని, నాటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో పార్నపల్లి అనే గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు.
ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతల ఇళ్లకు డ్రిల్ చేసి డైనమేట్లు పెట్టి పేల్చారు.. ఇదీ రాజారెడ్డి చరిత్రని మండిపడ్డారు. ఓ ఇంటిని డైనమేట్లు పెట్టి పేల్చేసిన ఘటనను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేదని, తన ప్రత్యర్థుల మీద దాడి చేయించి… అదే సందర్భంలో వేరే చోట ఉన్నట్టు సృష్టించుకోవడం అనేది వైఎస్ ఫ్యామిలీతోనే మొదలైందని, లింగాల మండలంలో ముగ్గురు టాప్ లీడర్లను భయానకం సృష్టించి లొంగదీసుకున్నారని విమర్శించారు. ఇలాంటివి పదుల సంఖ్యలో పులివెందులలో జరిగాయని పయ్యావుల ప్రస్తావించారు.
రాజారెడ్డి నుంచి మొదలుకుని పులివెందులలో జరిగిన ఘటనలపై పుస్తకం వేస్తామని.. చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్ను కంట్రోల్లోకి వచ్చిందన్నారు. వైఎస్ ఫ్యామిలీ మొదలు పెట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను కంట్రోల్ చేయడానికి 30 ఏళ్లు పట్టిందని, జగన్ బాధితుడు కాదు.. నిందితుడని మండిపడ్డారు. రప్పా రప్పా అంటే వారితో ఫొటోలు దిగుతారని, సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయిన పట్టించుకోరని విమర్శించారు.
ఇవాళ గొడ్డలి అంటే జగన్ మోహన్ రెడ్డికి ఉలికిపాటుకు గురవుతున్నారని, గొడ్డలిపోటును గుండెపోటుగా చూపించగలరని, నిజాలను ప్రజలకు చెప్పాలి… అవగాహన కల్పించాలన్నారు. అందుకే గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం… గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్ అంటూ పిలుపునిచ్చారు. ఓ తరానికి ఉపాధి కల్పించేలా చంద్రబాబు అవకాశాలు సృష్టించారని, జగన్ మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాలను పొగొడుతున్నాడని, 800 కంపెనీలను గ్రౌండ్ చేయబోతున్నామని తెలిపారు. వ్యవస్థల మీద గొడ్డలి పోటు వేశావు.. పోలవరం మీద గొడ్డలి వేటు వేశావ్.. పరిశ్రమల మీద గొడ్డలి వేటు వేశావ్.. అందుకే మీది గొడ్డలి పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అచ్చెన్న అరెస్ట్ నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు భయం సృష్టించే ప్రయత్నం చేశారని, పొక్లెయిన్లతో జగన్ విధ్వంసం చేస్తే… నిర్మాణానికి పొక్లెయిన్లను వాడుతున్నామన్నారు.
